సోమవారం 25 మే 2020
Telangana - Apr 01, 2020 , 01:38:14

360 కోట్లతో మందులు

360 కోట్లతో మందులు

  • అందుబాటులోకి లక్ష పీపీఈ కిట్లు, వెయ్యి వెంటిలేటర్లు
  • తయారీకి ముడిసరుకు అందించేలా రిలయన్స్‌తో చర్చలు
  • మంత్రులు కేటీఆర్‌, ఈటల సమాలోచనలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఎంతమంది వ్యాధిగ్రస్థులు వచ్చినా వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.360 కోట్లతో మందులు, ఐవీ ఫ్లూయిడ్స్‌ వంటివి సిద్ధంచేస్తున్నారు. వెయ్యి వెంటిలేటర్లను అందుబాటులోకి తేవడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. డీఆర్డీవో ద్వారా వెంటిలేటర్లను సమకూర్చుకోవాలని నిర్ణయించింది. 500 వెంటిలేటర్లను ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి, మరో 500 వెంటిలేటర్లను కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) కింద కొనుగోలు చేసి అందుబాటులో ఉంచనున్నారు. కరోనా చికిత్స ఏర్పాట్లపై ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు, వైద్యారోగ్య, కుటుంబసంక్షేమశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పలు అంశాలపై చర్చించారు. అలాగే, ప్రభుత్వానికి తోడ్పాటునందించేందుకు ముందుకువచ్చిన పలు కార్పొరేట్‌ సంస్థలతో సమాలోచనలు జరిపారు. 

లక్షకుపైగా పీపీఈ కిట్లపై దృష్టి

కొవిడ్‌-19 వ్యాధిగ్రస్థులకు సేవలందిస్తున్న వైద్యసిబ్బందికి కావాల్సిన పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ) కిట్లపై ప్రధానంగా దృష్టిపెట్టారు. లక్షకుపైగా పీపీఈ కిట్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. స్థానికంగా డిస్పోజబుల్‌ పీపీఈ కిట్లను సిద్ధంచేసేందుకు ముడిసరుకు అందించేలా రిలయన్స్‌ సంస్థతో చర్చించారు. పీపీఈలను ఉత్పత్తి చేసేలా స్థానిక చిన్న తరహా పరిశ్రమల ప్రతినిధులతో మంత్రులు చర్చలు జరిపారు. ఎన్ని పాజిటివ్‌ కేసులు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా చికిత్స అందించే నిమిత్తం రూ.360 కోట్లతో యాంటీ రిట్రోవైరల్‌, యాంటీ బయాటిక్స్‌ వంటి మందులు, ఫ్లూయిడ్స్‌, ఎన్‌-95 మాస్కులు, హైడ్రో క్లోరోక్విన్‌ మాత్రలు, ఇతర పరికరాలను అందుబాటులోకి తేనున్నారు. వైద్యసేవలు అందించేందుకు 15 వేల సిబ్బందిని సిద్ధంచేశారు. ఒక్క కిట్‌తో వంద మందికి పరీక్షలు చేసే కిట్లను పెద్ద సంఖ్యలో కొనుగోలు చేయాలని నిర్ణయించారు.


logo