బుధవారం 03 జూన్ 2020
Telangana - Mar 30, 2020 , 00:01:53

గుమ్మం తట్టిన వైద్యం

గుమ్మం తట్టిన వైద్యం

  • మంత్రి కేటీఆర్‌ చొరవతో..
  • బాధితుడి ట్వీట్‌తో చిన్నారికి వైద్య పరీక్షలు

రాయపర్తి: లాక్‌డౌన్‌ కారణంగా ఓ వ్యక్తి ఇంటికి వెళ్లలేని పరిస్థితి. ఇంటి వద్ద 27 రోజుల చిన్నారికి ఆరోగ్య సమస్య.. ఏం చేయాలో తెలియని సదరు వ్యక్తి మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించగా.. వైద్యుడితోపాటు సిబ్బంది సదరు వ్యక్తి ఇంటికి వెళ్లి చిన్నారిని పరీక్షించారు. వివరాల్లోకి వెళితే.. వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలం సన్నూరు గ్రామ సమీపంలోని బాల్‌నాయక్‌ తండాకు చెందిన భూక్య అనిత-ప్రవీణ్‌కుమార్‌ దంపతులు. వీరికి 27 రోజుల క్రితం పాప జన్మించింది. ప్రవీణ్‌కుమార్‌ వృత్తిరీత్యా నల్గొండ జిల్లాలో ఉండగా ఇంటి వద్ద భార్య, కూతురు ఉంటున్నారు. ఆదివారం చిన్నారి అనారోగ్యానికి గురైంది. 

ఆందోళనకు గురైన ప్రవీణ్‌కుమార్‌.. తన చిన్నారి అనారోగ్యంతో బాధపడుతున్నదని, లాక్‌డౌన్‌ నేపథ్యంలో తాను నల్లగొండ నుంచి ఇంటికి వెళ్లలేకపోతున్నానని, ఏం చేయాలో తోచడం లేదంటూ తన సమస్యను ట్విట్టర్‌ వేదికగా మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాడు. తక్షణమే స్పందించిన మంత్రి కేటీఆర్‌ చిన్నారికి వెంటనే వైద్య సేవలు అందేలా చూడాలని వరంగల్‌ రూరల్‌ కలెక్టర్‌ను ఆదేశించారు. కలెక్టర్‌ ఆదేశాలతో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి మధుసూదన్‌ స్థానిక మండల వైద్యాధికారి డాక్టర్‌ భూక్య వెంకటేశ్‌కు సూచించగా ఆయన బాల్‌నాయక్‌ తండాలోని ప్రవీణ్‌కుమార్‌ ఇంటికి చేరుకొని చిన్నారిని పరీక్షించారు. ఆ వెంటనే మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానకు తరలించగా అక్కడ వైద్య చికిత్స అందిస్తున్నారు. తన పాపకు వైద్యం అందడంతో ప్రవీణ్‌కుమార్‌ మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


logo