సోమవారం 13 జూలై 2020
Telangana - Mar 29, 2020 , 13:52:54

వలస కూలీలందరికీ వైద్య పరీక్షలు

వలస కూలీలందరికీ వైద్య పరీక్షలు

మహబూబాబాద్  : కరోనా మహమ్మారి దెబ్బకు వలస కూలీలు ఇబ్బందులు పడకుండా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటోంది. మహారాష్ట్ర నుంచి మహబూబాబాద్ కు పని కోసం వచ్చిన కూలీలు కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పనిలేక, ఇంటి దగ్గర అత్యవసరం ఉందనే  సమాచారం తెలిసి తిరిగి ఇంటిముఖం పట్టారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న వలస కూలీలు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు పడకుండా చూసుకోవాలని సూచించడంతో మహరాష్ట్ర నుంచి వచ్చిన కూలీలు తిరిగి వెళ్తున్నారన్న సమాచారం అందుకున్న మంత్రి  సత్యవతి రాథోడ్ హుటాహుటిన వారున్న ప్రాంతానికి చేరుకున్నారు. వారి సమస్యలను విన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రాలు దాటకూడదనే ప్రభుత్వ నిబంధనలు వివరించి, వారికి ఉండడానికి పాఠశాలలో వసతి, తినడానికి రెండు క్వింటాళ్ల బియ్యం, వంట సామాగ్రి, పది కుటుంబాలకు పదివేల రూపాయలను వ్యక్తిగతంగా అందించారు. వెంటనే అధికారులను పిలిచి వీరికి వైద్య పరీక్షలు చేయాలని ఆదేశించారు.  కరోనా మహమ్మారి నేపథ్యంలో మన రాష్ట్రంలో ఉన్నవారెవరైనా ఆకలితో అలమటించకూడదు, ఉండడానికి ఇబ్బందులు పడవద్దన్న సిఎం కేసిఆర్ పిలుపుతో నిన్న, నేడు వలస కూలీలున్న ప్రాంతాలకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని, వారికి కావల్సిన వసతులు, భోజన ఏర్పాట్లు, వైద్య చికిత్సలతో పాటు వ్యవసాయ పనుల్లో వారికి ఉపాధి కల్పించాలని స్థానిక అధికారులు, నేతలకు ఆదేశాలు జారీ చేశారు.

మహబూబాబాద్ లో దాదాపు 5వేలకు పైగా వలస కార్మికులు మహారాష్ట్ర నుంచి మిర్చి ఏరివేత కోసం, ఇతర పనుల కోసం వచ్చారని, వీరందరిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని, వారికి పనులు కల్పించడంతో పాటు కావల్సిన అన్ని వసతులు కూడా కల్పిస్తామన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 105 మంది విదేశాల నుంచి వచ్చినవారున్నారని, వీరిలో దాదాపు 100 మంది 14 రోజులు క్వారంటైన్ పూర్తి చేసుకుని క్షేమంగా బయటకు వచ్చారని మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. మిగతా 40 మంది పరిశీలనలో ఉంచామని, ఒకటి, రెండు రోజుల్లో వీరి 14 రోజుల క్వారంటైన్ కూడా పూర్తవుతుందని తెలిపారు. నేడు కొత్తగా ఇద్దరిని క్వారంటైన్ చేశామన్నారు. కరోనా బారి నుంచి బయట పడాలంటే ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని, ఎవ్వరూ కూడా సరిహద్దులు దాటకూడదని, అదేవిధంగా ఇక్కడి స్థానికులు ఇళ్లలోనే స్వీయ నిర్భందంలో ఉండాలని విజ్ణప్తి చేశారు. మన నిర్లక్ష్యం మనకే కాకుండా సమాజానికి కూడా ప్రమాదకరం కానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కచ్చితంగా ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని, స్వీయ నియంత్రణ పాటించాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు.logo