శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 16, 2020 , 02:31:00

వరద ప్రాంతాలకు వైద్య బృందాలు

వరద ప్రాంతాలకు వైద్య బృందాలు

  • అంటువ్యాధులను అరికట్టేందుకు చర్యలు
  • వైద్యశాఖను సంసిద్ధం చేయాలి
  • ముంపు ప్రాంతాల్లో ఆహార పంపిణీ
  • దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు
  • అధికారులతో సమీక్షలో మంత్రి కేటీఆర్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: భారీ వర్షాలతో వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశమున్నందున వెంటనే వైద్య బృందాలను పంపాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ‘104’ వాహనాలు, వైద్య సిబ్బందితో కూడిన బృందాలను వెంటనే రంగంలోకి దించాలని చెప్పారు. అంటువ్యాధుల నివారణపై ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. బీఆర్కేభవన్‌లోని తాత్కాలిక సచివాలయంలో గురువారం ఉదయం ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో వర్షాలు, వరదల కారణంగా నగరంలో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించారు. జీహెచ్‌ఎంసీలోని పలు ప్రాంతాల్లో వరద నీరు తగ్గడం ప్రారంభమైనందున తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ‘వర్షాలు తగ్గుముఖం పట్టాయి. వర్షాల అనంతరం వచ్చే అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇందుకు వైద్యశాఖను సంసిద్ధం చేయండి’ అని అధికారులను ఆదేశించారు. ప్రజలు వేడి చేసి చల్లార్చిన నీటిని తాగేలా అవగాహన కల్పించాలని సూచించారు. అంటువ్యాధుల నివారణకు తగిన మార్గదర్శకాలు జారీచేయాలని చెప్పారు. అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల్లో దోమల నివారణకు విస్తృతంగా పిచికారీ చేయాలని తెలిపారు. వైద్య, పురపాలక, జలమండలి, జీహెచ్‌ఎంసీ అధికారులు సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు.

రోడ్లకు వెంటనే మరమ్మతులు

భారీ వర్షాల కారణంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో రోడ్లు దెబ్బతిన్నాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వాటిని గుర్తించి వెంటనే ఆయా రోడ్లకు మరమ్మతులు నిర్వహించి, రవాణాకు ఎలాంటి ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోడ్ల మరమ్మతుల పనులను వెంటనే మొదలుపెట్టాలని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో రహదారులు, భవనాలశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, రెవెన్యూ, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి దివ్య, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్‌రోస్‌తో పాటు సర్ఫరాజ్‌ అహ్మద్‌ తదితర అధికారులు పాల్గొన్నారు. 

పునరావాస శిబిరాలకు 45 వేల మంది

జీహెచ్‌ఎంసీ పరిధిలో ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలను తరలించడం కోసం 64 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి 45 వేల మందిని తరలించినట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వీరందరికీ ఆహారం అందించామన్నారు. ముంపు ప్రాంతాలలో ఇంకా ఉన్న ప్రజలకు అహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను కోరారు. చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున వారికి దుప్ప ట్లు అందించాలని చెప్పారు. నగరంలో శిథిలావస్థలో ఉన్న, నిర్మాణంలో ఉన్న భవనాలను తనిఖీ చేయాలని మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్న భవనాలను గుర్తించి, వాటిలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలని చెప్పారు.