శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 24, 2020 , 23:59:43

దాస్తే దహిస్తుంది..

దాస్తే దహిస్తుంది..

  • నిర్లక్ష్యం వీడితే అందరూ క్షేమం
  • విదేశాలనుంచి వచ్చారా?.. వివరాలివ్వండి
  • బాధితులు, సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అమెరికా నుంచి పదిరోజుల క్రితం ఓ యువకుడు నగరానికి వచ్చాడు. తన ఆరోగ్యం బాగానే ఉందనుకొని ఊరంతా ఎక్కడపడితే అక్కడ తిరిగాడు. మిత్రులతో పార్టీ చేసుకున్నాడు. కానీ వారంతర్వాత హఠాత్తుగా దగ్గు, జలుబు, జ్వరం మొదలైంది. ఈ విషయం బయటపడకుండా రెండురోజులు జాగ్రత్తపడ్డాడు. కానీ పరిస్థితి విషమించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మంగళవారం వెళ్లి గాంధీ దవాఖానలో చేరాడు. దీంతో అతని బంధువులు, మిత్రులు, ఆఫీసు సహచరులలో ఆందోళన మొదలైంది. శేరిలింగంపల్లిలోని ఒక గేటెడ్‌ కమ్యూనిటీలో 39 ఏండ్ల మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆమె ఈ నెల 12న జర్మనీ నుంచి వచ్చారు. ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటున్నారు. 

ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చందానగర్‌ సర్కిల్‌ వైద్య సిబ్బంది ఆమెను గాంధీ దవాఖానకు తరలించారు. ఆమె విదేశాల నుంచి వచ్చిన సంగతి అపార్ట్‌మెంట్‌ సంఘానికి తెలియదు. ఇప్పుడు గేటెడ్‌ కమ్యూనిటీ నివాసితులెవరినీ బయటకు రావొద్దని ఆంక్షలు విధించారు. ఇప్పుడు ఆమె ఇంటి చుట్టుపక్కలవారందరూ ఆందోళన చెందుతున్నారు. ఓ యువకుడు ఇటీవల దుబాయ్‌ నుంచి సాగర్‌ రోడ్డులోఉన్న తన గ్రామానికి వచ్చాడు. తెలిసినవారందరినీ కలిశాడు. అతడికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. తాను దుబాయ్‌ నుంచి వచ్చిన విషయాన్ని ఆ యువకుడు అధికారులకు తెలియజేయలేదు. ఇప్పుడు అతని బంధువులు, మిత్రులలో టెన్షన్‌ మొదలైంది.

నిర్లక్ష్యం ఖరీదు ఎన్ని ప్రాణాలో!

ఓ వ్యక్తి నిర్లక్ష్యం తనకు మాత్రమే కాకుండా.. తన బంధువులు, మిత్రు లు, సహచరుల ప్రాణాలకు కూడా ముప్పు తెస్తున్నది. ఆ వ్యక్తి స్వచ్ఛందంగా తన విదేశీ పర్యటనను అధికారులకు వెల్లడించి ఉంటే, అధికారులు సైతం అతనొక్కడిపైనే ప్రత్యేక శ్రద్ధచూపి జాగ్రత్తలు తీసుకునేవారు. అతని నిర్లక్ష్యం మూలంగా ఆ వ్యక్తి కలుసుకున్నవారందరినీ కనిపెట్టి వైద్య పరీక్షలు చేయాల్సి వస్తున్నది. ఇటువంటి అలసత్వమే ఇటలీ, స్పెయిన్‌ దేశాలలో వేల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంటున్నది. వారి నిర్లక్ష్యమే యూరోపియన్‌, అమెరికన్‌ దేశాల్లో కరోనా కరాళనృత్యానికి కారణమవుతున్నది. 

జాడలేని 9వేల మంది

ఈ నెల ఒకటోతేదీ తరువాత విదేశాల నుంచి దాదాపు 20వేల మంది హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో కాలుమోపారు. వీరిలో సుమారు 11వేల మంది వివరాలను ప్రభు త్వం కనుక్కున్నది. మిగిలిన తొమ్మిదివేల మంది వివరాలను కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నది. వీరి పాస్‌పోర్టుల్లో పాత చిరునామాలే ఉండటంతో వారి ఆచూకీ లభించడం లేదని తెలుస్తున్నది. పైన పేర్కొన్న అమెరికా యువకుడిలాగా వీరిలో ఏ కొంతమందికి కరోనా సోకినా నష్టం భారీగా ఉంటుంది. అందుకే విదేశాల నుంచి వచ్చినవారి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా వ్యవహరించాలి. ఈ నెల ఒకటో తేదీ తరువాత విదేశాల నుంచి వచ్చినవారి వివరాలను స్థానిక అధికారులకు తెలియజేయాలి. ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడితే.. మన రాష్ర్టాన్ని పెను ఉత్పాతం నుంచి తప్పించవచ్చు.

సమాచారమివ్వడమే రక్ష

మన ప్రాంతంలో, రాష్ట్రంలో ఇటువంటి ముప్పును నివారించాలంటే అందరూ అప్రమత్తమవ్వాలి. గత రెండువారాలలో విదేశాల నుంచి వచ్చినవారందరూ అధికారులకు స్వచ్ఛందంగా తెలియజేయాలి. వారు ఎంత ప్రియమైన బంధువైనా, ఆప్తమిత్రుడైనా, ఇరుగుపొరుగువారైనాసరే.. విదేశాల నుంచి వచ్చి ఉంటే.. మనమైనా వారి వివరాలను తక్షణమే అధికారులకు అందజేయాలి. కరోనా బాధితుల, అనుమానితుల, అలాగే వారి సమాచారమిచ్చినవారి వివరాలను అధికారులు గోప్యంగా ఉంచుతారు. ఈ విషయంలో భయపడాల్సిన అవసరమే లేదు. మనకెందుకులే అనుకున్నా.. మనవాళ్లే కదా అని అలసత్వం ప్రదర్శించినా.. వారితోపాటు అందరూ కరోనా మహమ్మారి బారిన పడాల్సి వస్తుంది. 


logo