మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Aug 24, 2020 , 19:47:05

24 గంటల పాటు వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలి : మంత్రి ఈటల

24 గంటల పాటు వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలి : మంత్రి ఈటల

మహబూబాబాద్‌ : 24 గంటల పాటు వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ హెచ్చరించారు. సోమవారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్‌ జిల్లాకేంద్ర దవాఖానను ఆకస్మికంగా సందర్శించి వైద్యశాఖ పనితీరును పరిశీలించారు. స్వయంగా  పీపీఈ కిట్లు ధరించి ఐసోలేషన్ వార్డుల్లో పర్యటించి కరోనా పేషంట్లకు ధైర్యం చెప్పారు. 

అనంతరం మంత్రులు కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి ఈటల మాట్లాడుతూ జిల్లాలో కరోనా కేసులు పెరుగకుండా మరింత పర్యవేక్షణ చేయాలన్నారు. ఇక నుంచి ఒక్క మరణ కేసు కూడా నమోదు కావొద్దని ఆదేశించారు. అవసరమైన చోట సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అవసరమైతే ఐసోలేషన్ వార్డుల నిర్మాణానికి తాత్కాలిక షెడ్లను నిర్మించుకోవాలని మంత్రి ఆదేశించారు.

కలెక్టర్ వి.పి గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలో కరోనా కేసులు పెరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతామన్నారు. కరోనా కట్టడికి చేపడుతున్న పనితీరు గురించి కలెక్టర్‌ మంత్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బిందు, మహబూబాబాద్, ఇల్లందు ఎమ్మెల్యేలు బానోత్ శంకర్ నాయక్, బానోత్ హరిప్రియ, అదనపు కలెక్టర్లు అభిలాష, ఎం వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo