సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 03:13:20

తెలంగాణ వ్యూహం కరెక్ట్‌

తెలంగాణ వ్యూహం కరెక్ట్‌

  • ఐసీఎంఆర్‌ నిబంధనల మేరకే ముందుకు..
  • కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ అన్ని వేళలా సాధ్యంకాదు
  • కరోనాపై పోరులో తెలంగాణది దీటైన పద్ధతి
  • ‘నమస్తే తెలంగాణ’తో వైద్య నిపుణుల వెల్లడి

  హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా రాష్ట్రంలో అడుగుపెట్టింది మొదలు.. పటిష్ఠంగా లాక్‌డౌన్‌ అమలు, రోగులకు మెరుగైన వైద్యం అందజేత, నిర్ధారణ పరీక్షలు, ఎప్పటికప్పుడు కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, వైరస్‌వ్యాప్తిపై సమీక్షలు, దానికి తగ్గట్టు చర్యలు, వ్యాధి సంబంధ సమస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్‌, దవాఖానల్లో వేల సంఖ్యలో బెడ్ల ఏర్పాటు, కంటైన్‌మెంట్‌ జోన్లు, హోం ఐసోలేషన్‌.. ఇలా తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ వ్యూహంతో మహమ్మారిపై పోరాటం సాగిస్తున్నదని వైద్య నిపుణులు పేర్కొన్నారు. పోలీసులు, వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికుల సేవలు వినియోగించుకుంటూ కరోనా కట్టడికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నదని చెప్పారు. కేంద్రం, ఐసీఎంఆర్‌ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నదని వెల్లడించారు. వాస్తవానికి కరోనాపై పోరులో ఒక్కో దేశానిది ఒక్కో విధానం.

  ఒక్కో రాష్ర్టానిది ఒక్కో వ్యూహం. అక్కడి పరిస్థితులు, వైరస్‌ వ్యాప్తి తదితర అంశాల ఆధారంగా ఇవి వేర్వేరుగా ఉండవచ్చు. వ్యూహాలు వేరైనా అన్ని రాష్ర్టాల లక్ష్యం కరోనా నుంచి ప్రజలను కాపాడటమే. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజలను కాపాడేందుకు పక్కా వ్యూహంతో పని చేస్తున్నదని నిపుణులు అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌ విధించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆచితూచి అడుగులు వేస్తున్నదని, దాంతో కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నదని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి అధునాతన వైద్యసదుపాయాలు అందించడంతో రాష్ట్రంలో మరణాల రేటు ఇప్పటి వరకు ఒక్క శాతం కూడా దాటలేదని, ప్రభుత్వ చర్యల ఫలితంగానే రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి అదుపులో ఉన్నదని స్పష్టం చేశారు.

  వైద్యుల శ్రమకు సాక్ష్యం మరణాల రేటు..

  రాష్ట్రంలో కరోనా మరణాల రేటు ఒక శాతం కంటే తక్కువే. అభివృద్ధి చెందిన దేశాలు కూడా భారీ ప్రాణనష్టాన్ని చవిచూశాయి. మన దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌లోనూ అత్యధికంగా మరణాలు నమోదవుతున్నాయి. ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలో మరణాల రేటు తక్కువగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. దీని వెనుక వైద్యుల శ్రమ ఎంతో దాగుందని, ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం చూపిస్తున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

  కొవిడ్‌ బాధితులకు అండగా..

  ఆర్టీపీసీఆర్‌, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలను ప్రభుత్వం పెద్ద ఎత్తునచేస్తున్నదని, జిల్లా దవాఖానలు, పీహెచ్‌సీల స్థాయిలో పరీక్షలను అందుబాటులోకి తీసుకువచ్చిదని వైద్య నిపుణులు తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారికి అండగా నిలుస్తూ సేవలు అందిస్తున్నదని, లక్షణాలు లేకున్నా హోం ఐసొలేషన్‌లో ఉంచి మందులు, తదితర వస్తువులతో కూడిన కిట్‌ను ఉచితంగా ఇవ్వటంతో పాటు, టెలిమెడిసిన్‌ సహాయం చేస్తున్నదని వెల్లడించారు.

  ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలి

  తెలంగాణలో పీహెచ్‌సీ స్థాయిలో కరోనా పరీక్షలు ప్రారంభించడం మంచి విషయం. అన్నింటికీ ప్రభుత్వాన్ని నిందించటం సరికాదు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలి. మాస్కులు కట్టుకోవటంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. పార్టీలు, ఫంక్షన్లు జరపటం వల్ల వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్నది. జనసాంద్రత ఉన్న పట్టణాల్లో వ్యాప్తి సహజంగానే ఉంటుంది. హైదరాబాద్‌లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం ఇలాంటిదే. దీన్ని ప్రభుత్వ వైఫల్యం అనలేం.

  - డాక్టర్‌ ఎంవీ రావు, సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌, యశోద హాస్పిటల్స్‌

  మన దగ్గర మెరుగైన చికిత్స 

  తెలంగాణలో మరణాల రేటు ఒక శాతం కంటే తక్కువే ఉన్నది. అంటే మన చికిత్స విధానం మెరుగ్గా ఉన్నట్టే లెక్క. ఇప్పుడున్న పరిస్థితుల్లో వందశాతం కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ సాధ్యం కాదు. ఒక వ్యక్తి గత 15 రోజుల్లో అనేక మందిని కలిసి ఉంటాడు. వీలయితే 50 శాతం వరకు కాంట్రాక్ట్‌ ట్రేసింగ్‌ చేసే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా అనేక చోట్ల కరోనా రోగులకు హోమియోపతి చికిత్స అందిస్తున్నాం. ఎంతోమంది కోలుకుంటున్నారు. కరోనా నివారణకు రోగనిరోధకశక్తిని పెంచేలా ‘ప్రివెంటివ్‌ డోస్‌' పంపిణీ చేస్తున్నాం. ఈ డోస్‌ తీసుకున్నవారిలో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 3 శాతానికి మించలేదు.

  - హోమియో డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌


  logo