ఫిబ్రవరి 1 నుంచి వైద్య కళాశాలలు పునఃప్రారంభం

హైదరాబాద్ : రాష్ర్టంలోని ప్రభుత్వ, ప్రయివేటు వైద్య కళాశాలలను ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొవిడ్ లాక్డౌన్ కారణంగా గత తొమ్మిది నెలలుగా మెడికల్ కాలేజీలు మూసివేసిన విషయం తెలిసిందే. కళాశాలల పునఃప్రారంభానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. అవసరమైన చర్యలు చేపట్టాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశిస్తూ వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 29వ తేదీన గవర్నర్ తమిళిసై సమక్షంలో అన్ని యూనివర్సిటీల వీసీలతో సమావేశం ఉండటంతో అందులో తీసుకునే నిర్ణయాల ఆధారంగా అవసరమైన మార్పులు చేస్తారని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 31న అన్ని ప్రభుత్వ, ప్రయివేటు మెడికల్, నర్సింగ్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో ఆరోగ్య వర్సిటీ, వైద్యవిద్య సంచాలకులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కాలేజీల ప్రారంభానికి అవసరమైన చర్యలు చేపట్టనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి ముందుగా తొలి ఏడాది(2019-20లో ప్రవేశాలు పొందిన) విద్యార్థులకు, తుది సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభించనున్నారు.