సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 17:53:54

మావోయిస్టు ప్రభావిత గ్రామంలో మెడికల్‌ క్యాంప్‌

మావోయిస్టు ప్రభావిత గ్రామంలో మెడికల్‌ క్యాంప్‌

కుమ్రం భీం ఆసిఫాబాద్ : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల గిరిజనులకు పోలీసులు అండగా ఉంటారని రామగుండం సీపీ, జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ సత్యనారాయణ తెలిపారు. జిల్లాలోని తిర్యాణి మండలంలో అత్యంత మారుమూల, నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన మంగి గ్రామంలో శుక్రవారం పోలీసులు మెడికల్ క్యాంపు నిర్వహించారు. గిరిజనులకు వైద్య పరీక్షలు చేయడంతోపాటు యువతకు వాలీబాల్ కిట్లను  అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగాల భర్తీలో యువతకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. 

మారుమూల ప్రాంతాల గిరిజనుల వైద్యం కోసం పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని, కరీంనగర్, మంచిర్యాల, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి నిపుణులైన వైద్యులను తెప్పించి వైద్యం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని యువత ఉపాధిలో స్థిరపడాలని సూచించారు. యువత చెడు మార్గంలోకి వెళ్లకుండా, అభివృద్ధి కోసం పాటుపడాలని అన్నారు. మంగి గ్రామానికి రోడ్డు వేయాలని గ్రామస్తులు కోరటంతో రోడ్డు నిర్మాణం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ సుధీంద్ర, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సురేష్ కుమార్, డీఎస్పీ అచ్చేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.