సోమవారం 26 అక్టోబర్ 2020
Telangana - Apr 20, 2020 , 01:12:07

వలస కార్మికులకు అండగా..

వలస కార్మికులకు అండగా..

 • ప్రత్యేక షెల్టర్ల ద్వారా అన్ని వసతుల కల్పన
 • ఉదయం టిఫిన్‌, రెండుపూటల భోజనం
 • ఒక్క మేడ్చల్‌ జిల్లాలోనే 6,300 మందికి ఆశ్రయం

  మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఉదయం లేవగానే వేడివేడి టిఫిన్లు.. ఉత్తరాది రాష్ర్టాలకు చెందినవారికి ప్రత్యేకంగా పూరి, చపాతి, ఇడ్లీ, వడ.. మధ్యాహ్నం సమయం లో ఘుమఘుమలాడే వెజ్‌ బిర్యానీ లేదా చికెన్‌ బిర్యానీ, మటన్‌ బిర్యానీ, ఎగ్‌ బిర్యా నీ.. రాత్రికి మళ్లీ ప్రత్యేకంగా భోజనం, రొట్టె లు, పాలు, పండ్లు, స్వీట్లు సరఫరా.. ఇదేదో హోటల్‌ మెనూ కాదు. పునరావాస కేంద్రాల్లోని పక్క రాష్ర్టాల కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు. సర్కారు.. వలస కార్మికులను కన్నబిడ్డల్లా చూసుకుంటూ కంటికిరెప్పలా కాపాడుతున్నది. కొవిడ్‌-19 లాక్‌డౌన్‌తో పనుల్లేక ఏ ఒక్కరి కడుపుమాడకుండా తోడుగా నిలుస్తున్నది. వైద్యశిబిరాల ద్వారా నిత్యం పరీక్షలు నిర్వహిస్తున్నది. దాదాపు 25 రోజుల నుంచి ఇదేతరహా ఆహారాన్ని అందిస్తున్నది. ఒక్క మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పరిధిలోనే 6 వేల పైచిలు కు వలస కార్మికులకు సుమారు లక్ష భోజనా లు పెట్టినట్టు అధికారులు తెలిపారు.  

  ప్రత్యేక షెల్టర్లలో ఏర్పాట్లు

  వివిధ రాష్ర్టాలకు చెందిన వేలమంది కార్మికులు మేడ్చల్‌ జిల్లాతోపాటు నగర శివారులోని పలు పరిశ్రమల్లో పనిచేస్తూ జీవిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వీరికి పనుల్లేకుండా పోయాయి. జిల్లాలో సుమారు 14,411 మంది ఇతర రాష్ర్టాలకు చెందినవారు ఉన్నట్టు గుర్తించామని అధికారులు తెలిపారు. వీరిలో కొందరు జిల్లాలో స్థిరనివాసం ఏర్పాటుచేసుకోగా, సుమారు 6,300 మంది పూర్తి నిరాశ్రయులుగా ఉన్నారు. వీరి కోసం ఆరు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న మరో 2,700 మంది కార్మికులను గుర్తించి.. వీరికి ఎక్కడికక్కడ షెల్టర్‌తోపాటు భోజన వసతి ఏర్పాటుచేశారు. రేషన్‌కార్డు లేకుండా జిల్లాలో అద్దె ఇండ్లలో ఉంటున్న 8 నుంచి 10 వేలమంది ఇతర రాష్ర్టాల కార్మికుల కుటుంబాలకు తక్షణ అవసరాల కింద రూ.500 చొప్పున నగదుతోపాటు 12 కిలోల బియ్యం అందిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ విద్యాసాగర్‌ తెలిపారు. 

  అన్ని వసతులతో ఆశ్రయం

  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో జిల్లాలోని ఇతర రాష్ర్టాల కార్మికులతోపాటు జిల్లా మీదుగా ఇతర రాష్ర్టాలకు కాలినడకన వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కార్మికులను చేరదీశాం. అన్ని వసతులతో ప్రత్యేక షెల్టర్లలో ఆశ్రయం కల్పించాం. వీరిలో ఉత్తరాది రాష్ర్టాల వారే ఎక్కువున్నారు. వారి ఆహారపు అలవాట్లకు తగినట్టు భోజన వసతిని కల్పిస్తున్నాం. రెండుపూటల భోజనం, రొట్టె, చపాతి, పాలు, పండ్లు, స్వీట్లు అందిస్తున్నాం. పునరావాస కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడంతోపాటు వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశాం.
  - వాసం వెంకటేశ్వర్లు,  మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ 


  logo