బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 05, 2020 , 13:24:53

కీస‌ర రెవెన్యూ ప‌రిధిలో ప‌ట్టా పాసుపుస్త‌కాలు ర‌ద్దు

కీస‌ర రెవెన్యూ ప‌రిధిలో ప‌ట్టా పాసుపుస్త‌కాలు ర‌ద్దు

మేడ్చ‌ల్  : కీస‌ర రెవెన్యూ ప‌రిధిలో తాసిల్దార్ ‌నాగ‌రాజు జారీ చేసిన ప‌ట్టా పాసు పుస్త‌కాలు ర‌ద్దు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ వాసం వెంక‌టేశ్వ‌ర్లు ఆదేశాలు జారీ చేశారు. ప‌ట్టా పాసుపుస్త‌కాలు ర‌ద్దు చేసి విచార‌ణ జ‌ర‌పాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. 

కీసర మండలం రాంపల్లి దయారాలో భూ వివాదం సెటిల్మెంట్‌ కేసు కొత్త మలుపులు తిరుగుతున్నది. ఇప్పటివరకు ఈ కేసులో పట్టుబడిన కీసర తాసిల్దార్‌ నాగరాజుతోపాటు శ్రీనాథ్‌యాదవ్‌, అంజిరెడ్డి పేర్లు బయటకు రాగా.. తాజాగా మరికొందరు రెవెన్యూ అధికారుల పేర్లు వినిపిస్తున్నాయి. కీసర నుంచి హన్మకొండకు లింకు కలుస్తున్నది. ఓ జిల్లా ఉన్నతస్థాయి అధికారి సంబంధాలను ప్రశ్నార్థకం చేస్తున్నది. 

కోటీ పది లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన తాసిల్దార్‌ నాగరాజును, మరో కీలక నిందితుడు శ్రీనాథ్‌యాదవ్‌ను మూడు రోజుల కస్టడీలో భాగంగా ఏసీబీ అధికారులు విచారించినప్పుడు కొత్త సంగతులు బయటపడినట్టు సమాచారం. మేడ్చల్‌ కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లుతో పాటు కీసర ఆర్డీవో రవి, హన్మకొండ తాసిల్దార్‌ కిరణ్‌ప్రకాశ్‌ పేర్లు కొత్త తెరపైకి వచ్చాయి. ఈ ముగ్గురి పేర్లను నాగరాజు తన వాంగ్మూలంలో ప్రస్తావించినట్టు ఏసీబీ ఇంటరాగేషన్‌ రిపోర్టును బట్టి తెలుస్తున్నదని విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి. ప్రత్యేకించి కలెక్టర్‌, ఆర్డీవో చెప్తేనే తాను హైదరాబాద్‌ కాప్రాలోని అంజిరెడ్డి ఇంటికి వెళ్లానని నాగరాజు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడుసార్లు ప్రస్తావించాడని తెలిసింది. అయితే.. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు చెప్పగా.. తనకేమీ తెలియదని, ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని ఆర్డీవో రవి చెప్తున్నారు. విచారణ సందర్భంగా కేసు అంశాలను నాగరాజు, శ్రీనాథ్‌ ఏసీబీ అధికారులకు పూసగుచ్చినట్టు వివరించారని సమాచారం. 


logo