మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 16, 2020 , 14:46:11

మేదరి కులస్తులకు చేయూతనివ్వాలి

మేదరి కులస్తులకు చేయూతనివ్వాలి

హైదరాబాద్ : రాష్ర్టంలోని మేదరి కులస్తులకు చేయుతనివ్వాలని కోరుతూ ఆ కుల సంఘం ప్రతినిధులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు.  సోమవారం బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో వినోద్ కుమార్ ను కలిసి వారు మేదరి కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

వెదురునే ప్రధానంగా జీవనాధారం చేసుకుని  జీవనం సాగిస్తున్న మేదరులను ప్రోత్సహించాలని, వృత్తి పరంగా కీలకమైన వెదురు ముడి సరుకును రాయితీపై అందించేలా చర్యలు తీసుకోవాలని సంఘ ప్రతినిధులు వినోద్ కుమార్ ను కోరారు.  మారుతున్న కాలానుగుణంగా మేదరులకు వృత్తి నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని సంఘ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.  మార్కెట్ ను అనుసరించి నూతన పరిజ్ఞానంతో, కొత్త విధానాలు అమలు చేసి వినూత్న రూపాల్లో ఉత్పత్తులు తయారు చేసేందుకు మేదరులకు తగిన తర్ఫీదు ఇవ్వాలని వారు పేర్కొన్నారు.

మేదరుల సంఘం ప్రతినిధులు పేర్కొన్న అంశాలపై తక్షణమే స్పందించిన బోయినపల్లి వినోద్ కుమార్  రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కి లేఖ రాశారు.  మేదరుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.  మేదరులకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని వినోద్ కుమార్ హామీనిచ్చారు.

ఈ ప్రతినిధి బృందంలో మేదరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె. వెంకట్రాముడు, ప్రధాన కార్యదర్శి కె. మురళీకృష్ణ, ప్రచార కార్యదర్శి ఎం. గంగాధర్, కోశాధికారి పి. హన్మంతు, హస్తకళల విభాగం  పి. సత్యదేవ్, తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>