సోమవారం 18 జనవరి 2021
Telangana - Jan 01, 2021 , 02:31:54

ఉత్తమ పోలీసులకు సేవా పతకాలు

ఉత్తమ పోలీసులకు సేవా పతకాలు

  • రాష్ట్ర అవతరణ, కొత్త ఏడాదిని పురస్కరించుకొని ప్రకటన
  • 1,300 మంది ఎంపిక 

హైదరాబాద్‌, డిసెంబర్‌ 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు ప్రభుత్వం పతకాలు ప్రకటించింది. గతేడాది (2020) రాష్ట్ర అవతరణ దినోత్సవం, నూతన సంవత్సరం (2021)ను పురస్కరించుకుని ఈ పతకాలకు ఎంపిక చేసింది. రాష్ట్ర మహోన్నత సేవాపతకం, ఉత్తమ సేవాపతకం, పోలీస్‌ కాఠిన్య సేవాపతకం, శౌర్యపతకం, సేవా పతకం క్యాటగిరీల కింద వీటిని ఎంపిక చేసింది.  పతకాల విజేతల పేర్లతో కూడిన జాబితాను హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా విడుదల చేశారు. అవార్డులు గెలుచుకున్న వారికి సంబంధించిన సర్వీస్‌ రికార్డులను సంబంధిత యూనిట్‌ అధికారులు కేంద్ర కార్యాలయానికి పంపాలని ఐజీ సంజయ్‌కుమార్‌ జైన్‌ కోరారు. కాగా, అన్ని విభాగాలు, అన్ని క్యాటగిరీల్లో కలిపి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వెల్లడించిన అవార్డుల జాబితాలో 686 మందికి పతకాలు దక్కాయి. అదేవిధంగా కొత్త ఏడాది సందర్భంగా విడుదల చేసిన జాబితాలో 614 మంది సిబ్బంది తమ ఉత్తమ సేవలకుగాను పలు పతకాలు దక్కించుకున్నారు.

వీరికి మహోన్నత సేవా పతకాలు 

పోలీస్‌శాఖ నుంచి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా (2020 ఏడాదికిగాను) మహోన్నత సేవా పతకాలకు ఇంటెలిజెన్స్‌ విభాగం డీఎస్పీ ఏ బాలకోటి(మహబూబ్‌నగర్‌ ఇంటెలిజెన్స్‌), ఐఎస్‌డబ్ల్యూ నుంచి ఏఆర్‌ఎస్సై ఏ జగపతిరెడ్డి, సీఐ సెల్‌ ఎస్సై కే శ్రీనివాస్‌రావు, టీఎస్‌ఎస్పీ బెటాలియన్స్‌ నుంచి మొదటి బెటాలియన్‌ అడిషనల్‌ క మాండెంట్‌ కొక్కు వీరయ్య, టీఎస్‌ఎస్పీ మొదటి బెటాలియన్‌ ఏఆర్‌ఎస్సై అఫ్జలుద్దీన్‌ఖాన్‌, హైదరాబాద్‌ సిటీ నుంచి బేగంపేట ఏసీపీ పింగలి నరేశ్‌రెడ్డి, సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఏఆర్‌ ఎస్సై ఎం రమేశ్‌, కరీంనగర్‌ నుంచి చిగురుమామిడి ఎస్సై ఎం సురేందర్‌, సైబరాబాద్‌ సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ పీ ధర్మారావు, సీఐడీ నుంచి ఏఎస్సై యూనుస్‌ఖాన్‌, హైదరాబాద్‌ పీటీవో నుంచి హెడ్‌కానిస్టేబుల్‌ కే తిరుపతిరాజు, రాచకొండ నుంచి ఎల్బీనగర్‌ ట్రాఫిక్‌ అడిషనల్‌ డీసీపీ మహ్మద్‌ తాజుద్దీన్‌ అహ్మద్‌ ఉన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా విడుదలచేసిన జాబితాలో మహోన్నత సేవా పతకానికి తెలంగాణ పోలీస్‌ అకాడమి డీఎస్పీ నంద్యాల నర్సింహారెడ్డి, పోలీస్‌ ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్‌ నుంచి హెడ్‌కానిస్టేబుల్‌ డేవిడ్‌ మోసెస్‌, ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌ కానిస్టేబుల్‌ ఏ పర్వతాలు ఎంపికయ్యారు.