శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 03, 2020 , 13:32:10

శ‌నివారం నుండి మ‌క్కా మ‌సీదులో ప్రార్థ‌న‌ల‌కు అనుమ‌తి

శ‌నివారం నుండి మ‌క్కా మ‌సీదులో ప్రార్థ‌న‌ల‌కు అనుమ‌తి

హైద‌రాబాద్ : చారిత్రాత్మక మక్కా మసీదులో శనివారం నుండి ప్రార్థనలకు హాజ‌ర‌య్యేందుకు అధికారులు అనుమతించారు. మొదటి 15 రోజుల్లో 50 మందికి మాత్రమే ప్రార్థ‌న‌ల‌కు అనుమ‌తిస్తారు. అనంత‌రం 100 మందికి అనుమతి ఉంటుంది. హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ నేతృత్వంలో బుధ‌వారం జ‌రిగిన‌ అత్యున్న‌త‌స్థాయి స‌మావేశంలో ఈ మేరకు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ సమావేశంలో మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎకె ఖాన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈవో మొహద్ ఖాసిం, ఎఐఎంఐఎం ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రి, ముంతాజ్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు. 

కోవిడ్ నేప‌థ్యంలో మక్కా మసీదు దాదాపు ఆరు నెలలుగా మూసివేయబడింది. కేర్ టేకర్స్, మేనేజింగ్ సిబ్బంది మాత్రమే ప్రార్థనలకు హాజరవుతున్నారు. ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్), ఈద్ ఉల్ అదా (బక్రిద్‌) ప్రార్థనలకు సైతం మసీదులోకి అనుమతించలేదు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈవో మొహద్ ఖాసిం స్పందిస్తూ... కోవిడ్-19 మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుస‌రిస్తూ, భౌతిక‌దూరాన్ని పాటిస్తూ మ‌సీదులో ప్రార్థ‌న‌ల‌కు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు చెప్పారు. మ‌సీదు ప్రాంగ‌ణాన్ని శానిటైజ్ చేస్తున్నామ‌న్నారు. రాబోయే రెండు రోజుల్లో ప్రార్థ‌న‌ల కోసం స్థ‌లాల‌ను మార్క్ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. 

శ‌నివారం నుండి 50 మంది చొప్పున అదేవిధంగా ఈ నెల 21 నుండి 100 చొప్పున ప్రార్థ‌న‌ల‌కు అనుమ‌తించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ప‌దేళ్లలోపు చిన్నారుల‌ను, 60 ఏళ్ల పైబ‌డిన వ్య‌క్తుల‌ను ప్రార్థ‌న‌ల‌కు అనుమ‌తించేదిలేద‌న్నారు. న‌మాజ్‌లో పాల్గొనే వ్య‌క్తులు సొంత మ్యాట్లు తెచ్చుకోవాల్సిందిగా సూచించారు. 400 సంవ‌త్స‌రాల చ‌రిత్ర క‌లిగిన ఈ పురాత‌న చారిత్రాత్మ‌క మ‌సీదులోకి ప్ర‌స్తుతానికి ప‌ర్యాట‌కుల‌ను అనుమ‌తించ‌డం లేద‌న్నారు. ప్రార్థ‌న స‌మ‌యంలో మాత్ర‌మే మ‌సీదు గేట్లు తెరిచి అనంత‌రం మూసివేయ‌బ‌డ‌తాయ‌న్నారు. 


logo