సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 12, 2020 , 02:46:56

మత కల్లోలాలకు కుట్ర

మత కల్లోలాలకు కుట్ర

  • హైదరాబాద్‌లో ప్రజలను రెచ్చగొట్టే యత్నం
  • గుజరాత్‌లో మతకట్టడాలను కూల్చలేదా? 
  • జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఫైర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లో మత కల్లోలాలు సృష్టించాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, వారి అటలు ఇక్కడ సాగవని జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ హెచ్చరించారు. శనివారం తెలంగాణభవన్‌లో మేయర్‌ మాట్లాడుతూ.. అభివృద్ధి పనులు చేపట్టినప్పడు మతపరమైన కట్టడాలను కూల్చివేయడం సహజమని తెలిపారు. ప్రస్తుత ప్రధాని గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు పెద్దఎత్తున మతపరమైన కట్టాడాలను అభివృద్ధి పనుల్లో భాగంగా కూల్చివేశారని గుర్తుచేశారు. ఆ పార్టీకి చెందిన నేతలే ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని చురకలంటించారు. 

పాత సచివాలయాన్ని కూల్చివేస్తున్నప్పుడు పొరపాటున కొన్ని శిథిలాలు అక్కడే ఉన్న మసీదు, ఆలయంపై పడ్డాయని గుర్తుచేశారు. అందుకే ప్రభుత్వ ఖర్చుతో మరింత విశాలంగా రెండు ప్రార్థనా మందిరాలను నిర్మిస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారని పేర్కొన్నారు. ఆయా మత పెద్దలతో మాట్లాడి దెబ్బతిన్న మతపర కట్టడాలను తొలిగించాలని నిర్ణయించారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధిని ఒప్పుకోవడానికి ప్రతిపక్షాలకు మనసు రావడంలేదని, నగర అభివృద్ధిలో దాదాపు 20కిపైగా మతపర ఆస్తులకు ప్రత్యామ్నాయాలను సూచించామని తెలిపారు. ప్రశాంత వాతావరణం చెడగొట్టే ప్రయత్నం చేయవద్దని ప్రతిపక్షాలకు సూచించారు. 

ఫ్రస్టేషన్‌లో కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు

కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ఫ్రస్టేషన్‌తో మాట్లాడుతున్నారని, వారిలో శాడి జం కనిపిస్తున్నదని విప్‌ ఎమ్మెస్‌ ప్రభాకర్‌ ఆరోపించారు. ఇక్కడి ప్రజలు గంగాజమునా తెహజీబ్‌ మాదిరిగా ఉంటారని పేర్కొన్నారు. గతంలో అధికార మార్పిడి కోసం కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు మత ఘర్షణలకు పాల్పడేవారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు మతం, ప్రాంతం, కులం అనేది తేడా లేదని, అన్ని సమానమేనని తెలిపారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నాయకులు సచివాలయం కూ ల్చివేత విషయంలో కోర్టును కూడా తప్పుదోవపట్టించారని విమర్శించారు. స చివాలయం చుట్టూ లక్ష మంది నివాసం ఉంటున్నారని చెప్పారని మండిపడ్డారు.


logo