శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 02, 2020 , 02:29:56

కరోనా కట్టడికి ఏకంకండి

కరోనా కట్టడికి ఏకంకండి

  • రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌
  • మేడే వేడుకల్లో కార్మికులకు నిత్యావసరాల పంపిణీ

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ/పర్వతగిరి: ‘కరోనా కట్టడికి ప్రపంచ మానవులారా ఏకంకండి’ అంటూ రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలో నిర్వహించిన మేడే ఉత్సవాల్లో ఆయన పాల్గొని కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీచేశారు. ఈ సందర్భంగా వినోద్‌ మాట్లాడుతూ.. ప్రపంచమంతా కరోనాతో యుద్ధం చేస్తున్న తరుణంలో కార్మిక, కర్షక, వర్తక, వ్యాపారవర్గాలన్నీ ఏకమై దానిని తరిమివేయడంలో మేడేను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఐక్యత కోసం ప్రపంచ కార్మికులారా ఏకంకండి అన్న నినాదం లాగే.. వైరస్‌ కట్టడికి ప్రపంచ మానవులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. వివిధరంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు మేలు జరిగేలా దాస్యం వినయభాస్కర్‌ అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. వరంగల్‌రూరల్‌ జిల్లా పర్వతగిరి మం డలం ఏనుగల్లులో ప్రతిమ ఫౌండేషన్‌ ఆధ్వర్యం లో 2 వేల మాస్కులను అందజేసినట్టు వినోద్‌కుమార్‌ కుమారుడు ప్రణయ్‌ తెలిపారు. తన తాత మురళీధర్‌రావుతో కలిసి కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్థులకు అవగాహన కల్పించినట్టు చెప్పారు.


తెలంగాణ భవన్‌లో మే డే  

ప్రపంచ కార్మికదినోత్సవం సందర్భంగా టీఆర్‌ఎస్కేవీ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి జెండాను  ఎగురవేశారు. కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ అనేక పథకాలు ప్రవేశపెట్టారని, ధర్నాలు, డిమాండ్లు చేయకముందే వివిధ రంగాల ఉద్యోగుల వేతనాలు పెంచిన ఘనత ఆయనదేనని కొనియాడారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం అధ్యక్షుడు రాంబాబు యాదవ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ రూప్‌సింగ్‌, టీఆర్‌ఎస్కేవీ ప్రధాన కార్యదర్శి పీ నారాయణ, వీ మారయ్య తదితరులు పాల్గొన్నారు.


logo