బుధవారం 03 జూన్ 2020
Telangana - May 01, 2020 , 07:13:55

రాష్ట్రంలో 42 డిగ్రీలవరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

రాష్ట్రంలో 42 డిగ్రీలవరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో పలుచోట్ల 42 డిగ్రీలవరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. మరికొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తున్నాయి. ఇంకొన్నిచోట్ల వడగండ్లు పడుతున్నాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వచ్చే రెండ్రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో 39.8 డిగ్రీలు

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. గురువారం నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 39.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.6 డిగ్రీలు, గాలిలో తేమ 30 శాతంగా నమోదైంది.

పెద్దపల్లి జిల్లాలో భగ్గుమన్న ఎండలు

పెద్దపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. గురువారం అత్యధికంగా పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో 42.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్‌ జిల్లాలో 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.


logo