హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): నోటిని శుభ్రంగా ఉంచి, దుర్వాసనను తగ్గించే ఓరల్ సొల్యూషన్స్ ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని గణనీయంగా తగ్గించవచ్చని యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ‘పొవిడోన్-అయోడిన్’ను మూతెడు తీసుకొని, చిన్నగ్లాసు నీటిలో కలిపి పుక్కిలించడం ద్వారా గొంతులో ఉండే వైరస్ను చంపవచ్చని నిర్ధారించారు. ఇయర్ బడ్స్ సాయంతో ఈ ద్రావణాన్ని ముక్కుగోడలపై రుద్దినప్పుడు ముక్కులో ఉండే వైరస్ నశిస్తుందన్నారు. 15-30 సెకండ్లలోనే వైరస్ను చంపేయగలుగుతుందని చెప్పారు. ఇలా రోజుకు రెండుసార్లుచేస్తే మంచి ఫలితం ఉంటుందని తెలిపారు. తద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చన్నారు. కచ్చితంగా నీళ్లల్లో కలిపిన ద్రావణాన్నే వినియోగించాలని, నేరుగా వాడితే ముక్కులోపలి పొరలు దెబ్బతినే అవకాశం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. కొవిడ్ బాధితుల గొంతు, ముక్కులో ఉండే వైరస్.. వారు మాట్లాడేటప్పుడు, దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు గాలిద్వారా ఇతరులకు వ్యాపిస్తుందని, ఆరోగ్యవంతుల శరీరంలోకి కూడా గొంతు, ముక్కు ద్వారా నే ప్రవేశిస్తుందని, ఈ రెండు ప్రక్రియలను నియంత్రించగలిగితే వైరస్ వ్యాప్తిని గణనీయంగా తగ్గించవచ్చని చెబుతున్నారు. ఇందుకు ఓరల్ సొల్యూషన్స్ మంచి మార్గమని సూచిస్తున్నారు.