మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 02:51:34

విశాఖలో భారీ అగ్నిప్రమాదం

విశాఖలో భారీ అగ్నిప్రమాదం

  • పరవాడలోని ఫార్మా కంపెనీలో పేలుళ్లు
  • విశాఖ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి దాదాపు 11 గంటల ప్రాంతంలో విశాఖ పరవాడలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో పేలుడు సంభవించింది. సాల్వెంట్స్‌ ఫార్మా కంపెనీలో భారీ శబ్దాలతో ట్యాంకులు పేలుతూ పెద్దఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ కమ్ముకున్నది. మంటల్లో పలువురు చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు. పేలుడు శబ్దాలతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. 

ఫార్మాసిటీలోని వేర్వేరు కంపెనీల్లో మందులు తయారుచేసే క్రమంలో వచ్చే ఓ రకమైన వృథా ఆయిల్‌ను తిరిగి శుభ్రపరిచే ప్రక్రియ ఈ సాల్వెంట్స్‌ కంపెనీలో జరుగుతున్నది. రాత్రి షిఫ్ట్‌ మొదలైన కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పుతున్నారు. కంపెనీలో రియాక్టర్‌ పేలడంతోనే ప్రమాదం సంభవించిందని స్థానికులు అనుమానిస్తున్నారు. 17 సార్లు పేలుడు శబ్దాలు వినిపించాయని సమాచారం. ఎల్జీ పాలిమర్స్‌ ఘటన నుంచి బయటపడకముందే మరో ప్రమాదం జరుగడంపై విశాఖవాసుల్లో ఆందోళన కనిపిస్తున్నది.


logo