సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 19:03:21

వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి బృహత్తర కార్యాచరణ : బోయినపల్లి వినోద్ కుమార్

వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి బృహత్తర కార్యాచరణ : బోయినపల్లి వినోద్ కుమార్

వరంగల్ అర్బన్ : వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో , సమగ్ర కార్యాచరణ తో కృషి చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. శనివారం వరంగల్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ  డివిజన్ల కార్పొరేటర్లు , టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు , ఇతర ముఖ్య నాయకులతో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి వినోద్ కుమార్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల శాసనసభలో ప్రవేశ పెట్టిన రెవెన్యూ చట్టం , ఇతర బిల్లుల గురించి పార్టీ నాయకులకు కూలంకషంగా వివరించారు. 

రెవెన్యూ చట్టం ద్వారా దశాబ్దాల నుంచి ఉన్న భూ తగాదాలు , వివాదాలకు శాశ్వత పరిష్కారం జరుగుతుందని చెప్పారు. త్వరలో రానున్న పట్టభద్రుల నియోజకవర్గ ( నల్గొండ , ఖమ్మం , వరంగల్ ) ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాచరణ గురించి  చర్చించారు. కార్యకర్తల దృఢ సంకల్పంతో క్రమశిక్షణతో గెలుపే ధ్యేయంగా పని చేయాలని పిలుపునిచ్చారు. నగర ప్రాంతాలలో ఉన్న భూ వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు రుణ విమోచన సమితి చైర్మన్ నాగూర్ల వెంకన్న, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, వరంగల్ నగర పాలక సంస్థ డిప్యూటి మేయర్ ఖాజా సిరాజొద్ధిన్, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.logo