మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 09, 2020 , 12:56:32

మారుతీరావు బలవన్మరణం

మారుతీరావు బలవన్మరణం
  • ప్రణయ్‌ హత్యకేసులో ప్రధాన నిందితుడు
  • ఖైరతాబాద్‌ ఆర్యవైశ్య భవన్‌లో ఆత్మహత్య
  • తోడైన సుపారీ గ్యాంగ్‌ బ్లాక్‌మెయిల్‌!
  • కేసులతో మానసిక ఒత్తిడి
హైదరాబాద్‌సిటీబ్యూరో / ఖైరతాబాద్‌/ సుల్తాన్‌బజార్‌/మిర్యాలగూడ, నమస్తేతెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు, నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త మారుతీరావు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన కూతురు అమృత వర్షిణి కులాంతర వివాహాన్ని తట్టుకోలేకపోయాడు. 2018 సెప్టెంబర్‌ 14న జరిగిన అమృత భర్త ప్రణయ్‌ హత్యకేసులో మారుతీరావు నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో జైలుకు కూడా వెళ్లొచ్చాడు. ఇటీవల ఈ కేసు కోర్టులో ట్రయల్‌కు వచ్చింది. ప్రణయ్‌ హత్యానంతరం బంధువులతో మనస్పర్థలు.. సుపారీ గ్యాంగ్‌ ఒత్తిడితో కుంగిపోయిన మారుతీరావు శనివారం రాత్రి హైదరాబాద్‌లో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. 


న్యాయవాదిని కలిసేందుకు వచ్చి..

ప్రణయ్‌ హత్య కేసుకు సంబంధించి న్యాయవాదిని కలిసేందుకు శనివారం హైదరాబాద్‌కు వచ్చిన మారుతీరావు ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్యభవన్‌లో 306 సూట్‌ను అద్దెకు తీసుకున్నాడు. రాత్రి 8 గంటల సమయంలో కారు డ్రైవర్‌ రాజేశ్‌తో కలిసి ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ వద్ద గారెలు తెచ్చుకున్నాడు. రాజేశ్‌ను కారులోనే నిద్రించాలని చెప్పి, తాను గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఆదివారం ఉద యం 6 గంటలకు రాజేశ్‌ వెళ్లి తలుపు తట్టగా మారుతీరావు నుంచి సమాధానం రాలేదు. ఉదయం 7.30 గంటలకు మరోసారి పిలిచా డు. స్పందనలేకపోవడంతో మారుతీరావు భార్య గిరిజకు, పోలీసులకు సమాచారమిచ్చా డు. అక్కడికి చేరుకొన్న పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా.. మంచంమీద విగతజీవిగా కనిపించాడు. బెడ్‌పై సెల్‌ఫోన్‌, దవాఖానకు సంబంధించిన ప్రిస్కిప్షన్‌, కారు పత్రాలతోపాటు ‘గిరిజా క్షమించు.. అమృతా, అమ్మ దగ్గరకు రా..’ అని రాసి ఉన్న సూసైడ్‌ నోట్‌ లభించింది. బెడ్‌పైన వాంతి చేసుకున్న ఆనవాళ్లు ఉండటంతో క్లూస్‌టీం సభ్యులు వాటిని సేకరించి ల్యాబ్‌కు పంపించారు. కాగా, పురుగుల మందు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. 


పరువుహత్యతో అభాసుపాలు..

మారుతీరావు ఏకైక కుమార్తె అమృతవర్షిణి. అమృత 2018 మేలో మిర్యాలగూడ పట్టణంలోని ముత్తిరెడ్డికుంటకు చెందిన ప్రణయ్‌ కుమార్‌ను ప్రేమించి హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో పెండ్లి చేసుకున్నారు. 2018 సెప్టెంబర్‌ 14న ప్రణయ్‌ను కిరాయి వ్యక్తులు హత్య చేయగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు సెప్టెంబర్‌ 15న పోలీసులకు లొంగిపోయాడు. ఏడు నెలలపాటు జైలులోనే ఉన్న అతను బెయిల్‌పై బయటకు వచ్చి న తర్వాత మధ్యవర్తుల ద్వారా తన బిడ్డను ఇంటికి పిలిపించుకునేందుకు యత్నించాడు.  అందుకు అమృత అంగీకరించలేదు. గత డిసెంబర్‌లోనూ మరోమారు మధ్యవర్తుల ద్వారా ఒత్తిడి చేయగా అమృత పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో పోలీసులు కేసు నమో దు చేసి రెండోసారి అతడిని అరెస్టు చేశారు. ఈ కేసులో సైతం మారుతీరావు 20రోజులు జైలులో ఉండి బెయిల్‌పై విడుదలయ్యాడు.


వెంటాడిన కేసులు.. 

ప్రణయ్‌ హత్య తరువాత జరిగిన పరిణామాల గురించి సైఫాబాద్‌ పోలీసులు మిర్యాలగూడ పోలీసులను అడిగి తెలుసుకున్నారు. హత్య కేసులో నల్లగొండ పోలీసులు పక్కా ఆధారాలతో చార్జిషీట్‌ దాఖలు చేయగా.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రత్యేక కోర్టులో విచారణ తుదిదశకు చేరుకున్నది. ఈ కేసులో తనకు శిక్షపడే అవకాశాలున్నాయనే భయంతో మారుతీరావు మానసికంగా కుంగిపోయాడు. ఇటీవల తన గోదాంలోనూ గుర్తుతెలియని మృతదేహం లభించడంతో పోలీసులు విచారిస్తున్నారు. ప్రణయ్‌ హత్య తరువాత కూతురితోపాటు దగ్గరి బంధువులు కూడా తనతో సరిగ్గా ఉండటం లేదనే ఆవేదనతో తీవ్ర ఒత్తిడికి గురైనట్టు సమాచారం.


డబ్బుల కోసం హంతకుల ఒత్తిడి.. 

ప్రణయ్‌ హత్య కేసులో నిందితుల నుంచి మారుతీరావు బ్లాక్‌మెయిలింగ్‌కు గురైనట్టు తెలుస్తున్నది. ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వకపోవడంతో సుపారీ గ్యాంగ్‌తో మారుతీరావుకు విభేదాలు వచ్చినట్టు సమాచారం. హత్యకేసులో ప్రధాన నిందితుడిగా మారుతీరావు ఉండగా.. సుభాష్‌శర్మ, హజ్గర్‌ అలీ, మహ్మద్‌బారీ, కరీం, శ్రవణ్‌, శివ నిందితులుగా ఉన్నారు. వీరిలో ఒకరిద్దరు మారుతీరావును బెదిరించి, ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వకపోతే పోలీసులకు అప్రూవర్లుగా మారుతామని బెదిరించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆందోళనకు గురైన మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.  


ఉస్మానియాలో పోస్టుమార్టం

ఉస్మానియా ఫోరెన్సిక్‌ వైద్యులు డాక్టర్‌ సుధాకర్‌ నేతృత్వంలోని వైద్యుల బృందం మారుతీరావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించింది. అనంతరం ఆయన మృతదేహాన్ని భార్య గిరిజ, సోదరుడు శ్రావణ్‌కు అప్పగించారు. మారుతీరావు అంత్యక్రియలను మిర్యాలగూడలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమృత, మారుతీరావు ఇండ్ల వద్ద పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ఈ విషయమై అమృత మాట్లాడుతూ.. ప్రణయ్‌ను చంపినందుకు పశ్చాత్తాపంతోనే మారుతీరావు ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని మీడియాతో అన్నారు. 
logo
>>>>>>