గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 06, 2020 , 22:07:18

కన్నవారిని కాదని.. ప్రేమించినోడిని నమ్మి..

కన్నవారిని కాదని.. ప్రేమించినోడిని నమ్మి..

లక్ష్మణచాంద: కన్నవారిని కాదని, తను ప్రేమించినవాడే సరస్వమని నమ్మి వివాహం చేసుకుంది. కొత్త జీవితం ప్రారంభించి ఎన్నో కలలు కన్నది. కానీ ఆమె కలలు నాలుగైదు నెలలకే కల్లలయ్యాయి. అత్తింటి వేధింపులతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. భర్తతోపాటు కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నిర్మల్‌ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని రాచాపూర్‌లో చోటుచేసుకుంది. డీఎస్పీ ఉపేంద్ర రెడ్డి, స్థానికులు, మృతురాలి బంధువుల అందించిన వివరాల ప్రకారం.. నిర్మల్‌ జిల్లా కేంద్రం శాంతి నగర్‌కు  చెందిన ఇర్ల కావ్య ఆలియాస్‌ కుంట్ల కావ్య(23), లక్ష్మణచాంద మండలం రాచాపూర్‌ గ్రామానికి చెందిన పరమశ్వర్‌తో గతేడాది నవంబర్‌ ఒకటిన ప్రేమవివాహం చేసుకున్నారు. వివాహమైన  నాటి నుంచి కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. ఆమె బావ ఉమామహేశ్వర్‌తో పాటు అత్త లక్ష్మీ కట్నం తీసుకురావాలంటూ ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించసాగారు. తనను తీవ్రంగా వేధిస్తున్నారని గురువారం ఆమె ఫోన్‌ద్వారా తెలిపినట్లు మృతురాలి కుటుంబీకులు  తెలిపారు.రెండు రోజుల్లో తాము వచ్చి మాట్లాడుతామని, ఎటువంటి ఆందోళన చెందవద్దని  తెలిపినట్లు వారు తెలిపారు. అంతలోపే ఈ సంఘటన జరిగిందని బంధువులు వాపోయారు.


logo