గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 23:52:36

ముందే జరిగిన లగ్గాలు

ముందే జరిగిన లగ్గాలు

-జనతా కర్ఫ్యూ  నేపథ్యంలో.. 

-పలు జిల్లాల్లో ముహూర్తానికి ముందే వివాహాలు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: జనతా కర్ఫ్యూ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం జరగాల్సిన వివాహాలు శనివారం రాత్రే నిర్వహించారు. జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలం తాళ్లధర్మారంలో ఆదివారం రెండు వేర్వేరు చోట్ల వివాహాలు జరిపించేందుకు పెద్దలు ఏర్పాట్లు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న సర్పంచ్‌ మహిపాల్‌రెడ్డి, వార్డు సభ్యులతో కలిసి శనివారం సదరు కుటుంబాల వారికి కరోనా వైరస్‌, జనతా కర్ఫ్యూ గురించి అవగాహన కల్పించారు. దీంతో అదే రాత్రి రెండు వివాహాలను నిర్వహించారు. అలాగే మండలంలోని కండ్లపల్లిలోనూ ఆదివారం జరగాల్సిన ఓ వివాహం కుటుంబ సభ్యుల చొరవతో శనివారం రాత్రే జరిపించారు. 

  • కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలం పార్డ గ్రామానికి చెందిన మడవి మాన్కు కూతురికి సిర్పూర్‌(యు) మండలం బాబ్జీపేట్‌ (గుట్టగూడ) గ్రామానికి చెందిన గేడం ఆనంద్‌రావ్‌ కుమారుడితో వివాహం జరగాల్సి ఉంది. కర్ఫ్యూ తో ఎవరికీ ఇబ్బంది కలుగొద్దని ఇరువర్గాల అంగీకారంతో సోమవారం ఉద యానికి పెండ్లి వాయిదా వేశారు. బెజ్జూర్‌ మండలం పాపన్‌పేటలో మధు, తిరుపతి అనే వ్యక్తుల పెండ్లిళ్లు సైతం ఆదివారం జరగాల్సి ఉండగా, పోలీసులు అవగాహ న కల్పించడంతో శనివారం రాత్రే నిర్వహించారు. పోతెపల్లిలో రామకృష్ణ వివా హం కూడా శనివారం రాత్రే జరిగింది.  

వివాహవిందు వాయిదా

కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు ములుగు జిల్లా గుర్తూర్‌తండాలో ఆదివారం జరగాల్సిన బానోత్‌  కీమానాయక్‌-రుక్కమ్మ కుమారుడు యాకూబ్‌నాయక్‌ వివాహ రిసెప్షన్‌ను వాయిదా వేశారు. 2002లో తమ గ్రామంలో ప్రమాదవశాత్తు కాలిపోయిన ఇండ్లను పరిశీలించేందుకు వచ్చిన ఉద్యమ నేత, సీఎం కేసీఆర్‌ తమ కుటుంబానికి అండగా నిలిచారని, అందుకే తన కొడుకు రిసెప్షన్‌ను వాయిదా వేసుకొన్నట్టు కీమానాయక్‌ తెలిపారు.  


logo