శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Dec 25, 2020 , 01:38:59

కందుల కొనుగోలు కోటాను పెంచండి

కందుల కొనుగోలు కోటాను పెంచండి

నాఫెడ్‌కు మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ విజ్ఞప్తి  

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో మద్దతు ధరకు కొనుగోలు చేసే కందుల కోటాను పెం చాలని మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ మార గంగారెడ్డి.. నాఫెడ్‌కు విజ్ఞప్తి చేశారు. వానకాలంలో కంది విస్తీర్ణం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో పంట దిగుబడి పెరిగిందని, కొనుగోలు కోటాను 77 వేల టన్నుల నుంచి 2.20 లక్షల టన్నులకు పెంచాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం నాఫెడ్‌ ఎండీ సంజీవ్‌కుమార్‌ చంద్రతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పంటల సేకరణ, మద్దతు ధరపై చర్చించారు. రాష్ట్రంలో వానకాలంలో 10 లక్షల ఎకరాల్లో కంది సాగయిందని, 8.5 లక్షల టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశముందని తెలిపారు. అంతకుముందు మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ గంగారెడ్డి క్రిబ్‌కో సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిబ్‌కో చైర్మన్‌ చంద్రపాల్‌సింగ్‌, ఇతర డైరెక్టర్లతో సమావేశమైన ఆయన తెలంగాణలో పెరిగిన సాగుకు అనుగుణంగా యూరియా సరఫరాను పెంచాలని కోరారు. కార్యక్రమం లో మార్క్‌ఫెడ్‌ జనరల్‌ మేనేజర్‌ విష్ణువర్ధన్‌రావు పాల్గొన్నారు.


logo