మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Oct 27, 2020 , 02:49:01

గ్రామానికో ‘విలువ’

గ్రామానికో ‘విలువ’

  • ప్రాంతం ఆధారంగా మార్కెట్‌ వ్యాల్యు
  • ధరణి పోర్టల్‌లోనే మార్ట్‌గేజ్‌ వివరాలు
  • మోసాలకు తావులేకుండా పోర్టల్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: భూముల రిజిస్ట్రేషన్‌ మార్కెట్‌ విలువ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌ ద్వారా ఓ స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే పాక్షికంగా అందుబాటులోకి వచ్చిన పోర్టల్‌లో ప్రతి గ్రామానికి ఓ బేసిక్‌ రిజిస్ట్రేషన్‌ మార్కెట్‌ విలువను, పట్టణాలు, నగరాల్లో.. వార్డులు, బ్లాకులవారీగా బేసిక్‌ వ్యాల్యూను నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలను పోర్టల్‌లో ఎక్కించి సర్వే నంబర్లవారీగా రిజిస్ట్రేషన్‌ మార్కెట్‌ విలువ కనిపించేలా ఏర్పాట్లుచేసింది. గతంలో ఉన్న మార్కెట్‌ విలువలను మాత్రమే ధరణి పోర్టల్‌లో స్థిరీకరించిన ప్రభుత్వం, ఉన్న విలువలను ఏ మాత్రం పెంచలేదు. ప్రస్తుతం సర్వే నంబర్లవారీగా మార్కెట్‌ విలువల్లో కొంత మార్పులు వచ్చాయి. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో హైవే పక్కనే ఉన్న 262 సర్వే నంబర్‌లో ఎకరం మార్కె ట్‌ విలువ రూ.1.59 కోట్లు ఉంటే.. కొంత లోపలికి ఉన్న సర్వే నంబర్‌లో రూ.కోటికి తక్కువగా ఉన్నది. గతంలో ఈ రెండు సర్వే నంబర్లకు ఒకే విలువ ఉండేది. ఇలా ప్రతి సర్వే నంబర్‌కు దానికి ఉన్న డిమాండ్‌ను బట్టి మార్కెట్‌ విలువ మారనున్నది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఎకరం వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌ మార్కె ట్‌ విలువ రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలవరకు ఉండగా, పట్టణాల్లో ఎకరానికి రూ.30 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు ఉన్నది.

విచక్షణాధికారంతో పనిలేదు

గతంలో హైవే పక్కన ఉండే స్థలం, కాస్త లోపలికి ఉండే స్థలానికి ఒకటే రిజిస్ట్రేషన్‌ విలువ ఉండేది. దీంతో రిజిస్ట్రేషన్‌ చేసుకునే వ్యక్తి ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్‌ ధరతో విభేదించేవారు. ఈ మేరకు వాళ్లు పెట్టుకునే దరఖాస్తును రిజిస్ట్రేషన్‌శాఖ జిల్లా రిజిస్ట్రార్లు, ఐజీ పరిశీలించి అభ్యర్థనలో న్యాయం ఉన్నదనుకుంటే స్టాంపు చట్టం-1899 ప్రకారం తమకు కల్పించిన విచక్షణాధికారాన్ని ఉపయోగించి రిజిస్ట్రేషన్‌ విలువను తగ్గించేవారు. ఈ ప్రక్రియకు చాలాసమయం పట్టడంతోపాటు అవినీతి, అక్రమాలకు అవకాశం ఉండేది. ధరణి పోర్టల్‌తో వీటన్నింటికీ చెక్‌ పెట్టాలని భావించిన ప్రభుత్వం సర్వే నంబర్లవారీగా విలువను ఖరారుచేసింది. ఈ మేరకు స్టాంపు చట్టం-1899లో సవరణ తీసుకొచ్చి విచక్షణాధికారాలతో పనిలేకుండా చేసింది. అలాగే భూమికి సంబంధించిన ఎన్‌ కంబ్రెన్స్‌ డీటైల్స్‌లో సదరు భూమి యజమాని పేరుతో ఏదైనా బ్యాంకుకు మార్టిగేజ్‌ చేసి ఉందా? మార్జిగేజ్‌ చేసి ఉంటే ఆ బ్యాంకు వివరాలు, లోన్‌ మొత్తం, లోన్‌ చెల్లించాల్సిన కాలం, ప్రస్తుత పరిస్థితి ఇలా అన్ని వివరాలు పోర్టల్‌లోనే డిస్‌ప్లే అవుతున్నాయి. దీని ద్వారా భూమిని ఏదైనా బ్యాంకులో తనఖా పెట్టి ఉంటే ఇట్టే తెలిసిపోనున్నది. కొనుగోలుదారులు మోసపోకుండా ఇది ఉపయోగపడనున్నది.

ధరణిపై తాసిల్దార్లకు శిక్షణ నేడు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘ధరణి’ నిర్వహణపై తాసిల్దార్లకు ఒకరోజు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం ఘట్‌కేసర్‌ సమీపంలోని అనురాగ్‌ యూనివర్సిటీ క్యాంపస్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణకు తాసిల్దార్లు, నాయబ్‌ తాసిల్దార్లు,  కంప్యూటర్‌ ఆపరేటర్లు హాజరుకావాలంటూ వారికి వాట్సాప్‌ మెసేజ్‌ పంపించారు. వీరికి ఉదయం థియరీ క్లాసులు,  సాయంత్రం ప్రాక్టికల్‌ క్లాసులు నిర్వహించనున్నారు. ధరణి పోర్టల్‌ను ఈ నెల 29 మధ్యాహ్నం 12.30 గంటలకు అధికారికంగా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ధరణి ప్రారంభం తర్వాత రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, ఇతర భూ సంబంధమైన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్‌ 8 నుంచి రాష్ట్రంలో భూముల క్రయవిక్రయాలను రాష్ట్రప్రభుత్వం నిలిపివేసింది. అక్టోబర్‌ 29 నుంచి అవన్నీ పునర్‌ప్రారంభమవుతాయి. ఇప్పటికే తాసిల్దార్లు రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్లను ట్రయల్న్‌గ్రా చేపట్టారు. 20 నుంచి 40 వరకు నమూనా రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌లను చేపట్టారు.