బుధవారం 03 జూన్ 2020
Telangana - Jan 22, 2020 , 03:59:52

2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
  • వరిపొట్టు మాటున 1,335.4 కిలోల గంజాయి రవాణా
  • స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ.. ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వరిపొట్టు లారీలో గంజాయి తరలిస్తున్న ఓ ముఠా గుట్టును రట్టుచేశారు డీఆర్‌ఐ హైదరాబాద్‌ జోనల్‌ యూనిట్‌ అధికారులు. పక్కా సమాచారం మేరకు ఓ లారీని అడ్డగించి తనిఖీలుచేయగా పెద్దమొత్తంలో పొడి గంజాయి పట్టుబడింది. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.2 కోట్లవరకు ఉంటుందని అధికారులు మంగళవారం మీడియాకు తెలిపారు. భద్రాచలం నుంచి బీదర్‌కు పెద్దమొత్తంలో గంజాయి రవాణా చేస్తున్నట్టు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు డీఆర్‌ఐ హైదరాబాద్‌ జోనల్‌ యూనిట్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం వరిపొట్టు లోడుతో వస్తున్న లారీని హైదరాబాద్‌ శివారులోని పెద్దఅంబర్‌పేట టోల్‌ప్లాజా వద్ద డీఆర్‌ఐ అధికారులు అడ్డగించారు. లారీలోని లోడ్‌ను తనిఖీచేయగా వరిపొట్టు బస్తాల మధ్యలో 1,335.4 కిలోల ఎండు గంజాయిని గుర్తించినట్టు డీఆర్‌ఐ హైదరాబాద్‌ జోనల్‌ యూనిట్‌ అడిషనల్‌ డీజీ డీపీ నాయుడు తెలిపారు. ఎన్డీపీఎస్‌ యాక్ట్‌- 1985 కింద గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. గంజాయి తరలించే ముఠా, అధికారుల కండ్లుగప్పేందుకు లారీ నంబర్‌ప్లేట్లను మారుస్తూ వస్తున్నదని తెలిపారు. గంజాయి తరలిస్తున్న లారీ డ్రైవర్‌తోపాటు అతని వెంట ఉన్న మరో వ్యక్తిని కూడా అరెస్టు చేసినట్టు తెలిపారు.


logo