బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 08, 2020 , 15:51:38

ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి.. ఇద్దరు జవాన్లకు గాయాలు

ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి.. ఇద్దరు జవాన్లకు గాయాలు

కొత్తగూడెం క్రైం:  ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీలో మవోయిస్టులకు, భద్రతా బలగాలకి మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో పామేడ్ పోలీస్టేషన్ పరిధిలోని భట్టిగూడా సమీప అటవీ ప్రాంతంలో ఆదివారం భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడి కాల్పులు జరిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు. ఇరువర్గాల మధ్య సుమార 20నిమిషాల పాటు కాల్పులు జరిగాయి.

జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు పారిపోయారు. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించారు. సంఘటన స్థలం నుంచి నాలుగు మారణాయుధాలతో పాటు మందుగుండు సామగ్రి, మావోయిస్టులకు సంబంధించిన ఇతర సామగ్రిని జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా, మృతి చెందిన మావోయిస్టు తెలంగాణ ప్రాంతవాసిగా తెలుస్తోంది. పూర్తి వివరాలు అధికారికంగా ధ్రువపడాల్సి ఉంది.