శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 22:06:52

మావోయిస్టు దంపతుల లొంగుబాటు

మావోయిస్టు దంపతుల లొంగుబాటు

వరంగల్‌ : మావోయిస్టు పార్టీ డివిజనల్‌ కమిటీ మెంబర్‌, సెంట్రల్‌ రీజనల్‌ కమ్యూనికేషన్‌ విభాగం ఇంచార్జి గండ్రకోటి మల్లేశం అలియాస్‌ మల్లయ్య, దండకారణ్య స్పెషల్‌ జోన్‌ ఏరియా కమిటీ మెంబర్‌ చింత శ్రీలత అలియాస్‌ హైమ దంపతులు వరంగల్‌ పొలీస్‌ కమిషనర్‌ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ రవీందర్‌ వివరాలను వెల్లడించారు. మహబూబాబాద్‌ జిల్లా ఇంటికన్నె ప్రాంతానికి చెందిన గండ్రకోటి మల్లేశం 2003లో నర్సంపేట దళం కార్యదర్శి భారతక్క ప్రోత్సాహంతో మావోయిస్టు పార్టీ దళసభ్యుడిగా చేరాడు. 2004లో ఒడ్డుగూడెం శివారు ప్రాంతంలో చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో మల్లేశం తీవ్రంగా గాయపడగా వరంగల్‌లో చికిత్స పొంది 2005లో తిరిగి నర్సంపేట దళంలో చేరాడు. 

2006లో పార్టీ మల్లేశంను ఏరియా కమిటీ దళ సభ్యుడిగా నియమించడంతో ఆదే సమయంలో నర్సంపేట దళ సభ్యురాలు చింత శ్రీలత అలియాస్‌ హైమను వివాహం చేసుకున్నాడు. 2008లో పార్టీ ఆదేశాల మేరకు దళ సభ్యుడు శ్రీకాంత్‌తో కలిసి మధ్యప్రదేశ్‌లోని మడ్‌ ప్రాంతంలో పేలుడు పదార్ధాల తయారీ, కమ్యూనికేషన్‌ పరిజ్ఞానంపై పది నెలల పాటు శిక్షణ పొందాడు. దాడులు నిర్వహించేందుకు అవసరమైన పేలుడు పదార్థాలను తయారుచేసి పార్టీకి అందజేసేవాడు. 2011లో మల్లేశం డీసీఎం బాధ్యతలతో పాటు, సెంట్రల్‌ రీజనల్‌ బ్యూరో కమ్యూనికేషన్‌ విభాగం ఇంచార్జిగా భార్య చింత శ్రీలతతో కలిసి ఛత్తీస్‌గఢ్‌, ఒడిషా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ ప్రాంతాల్లో పని చేశాడు. 

మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం రాంపూర్‌కు చెందిన చింత శ్రీలత 2004లో దగ్గర బంధువు ముచ్చ వెంకన్న సహకారంతో నర్సంపేట దళంలో చేరారు. 2006లో మల్లేశంను వివాహం చేసుకొని పార్టీ ఆదేశాల మేరకు భర్తతో ఛత్తీస్‌గఢ్‌ తరలివెళ్ళి 2009 నుంచి సెంట్రల్‌ రీజనల్‌ బ్యూరో కమ్యూనికేషన్‌ విభాగంలో పని చేసింది. 2010లో ఏరియా కమిటీ సభ్యురాలిగా పని చేసి 2015లో గర్భందాల్చడంతో ఛత్తీస్‌గఢ్‌లో రహస్యంగా గడిపి పాపకు జన్మనిచ్చింది. పార్టీ ఆదేశాల మేరకు పాపను మల్లేశం తల్లికి అప్పగించి పార్టీలో కొనసాగుతున్నది. 

దంపతులు ఇద్దరు పొలీసులపై కాల్పులు జరిపిన ఘటనలతో పాటు ఇన్‌ఫార్మర్‌ల పేరిట హత్యలకు పాల్పడిన పలు ఘటనల్లో నిందితులని సీపీ రవీందర్‌ తెలిపారు. మల్లేశం మీద ఉన్న రూ. 5 లక్షలు, శ్రీలత పేరిట ఉన్న రూ. 4 లక్షల రివార్డును త్వరలోనే వారికి అందించడం జరుగుతుందని, తక్షణ పునరావాసం కింద రూ. 5,000 చొప్పుల ఆర్థిక సాయం చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ కల్పిస్తున్న ఉపాధి ఆవకాశాలను వినియోగించుకొని మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మహబూబాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డి, వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆపరేషన్స్‌ అడిషినల్‌ డీసీపీ ఉప్పుల తిరుపతి పాల్గొన్నారు. logo