గురువారం 09 జూలై 2020
Telangana - Mar 27, 2020 , 22:33:11

అధిక ధరలకు సరుకులు విక్రయిస్తున్న పలువురు అరెస్ట్

అధిక ధరలకు సరుకులు విక్రయిస్తున్న పలువురు అరెస్ట్

హైదరాబాద్: లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలకు నిత్యవసర వస్తువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయినా కూడా కరోనా సందర్భంగా ఏర్పాటు చేసిన లాక్‌డౌన్‌ను ఆసరగా చేసుకొని కొందరు వ్యాపారులు నిత్యవసర వస్తువులు, శానిటైజర్లు, మాస్క్‌లు ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఎవరు కూడా అధిక ధరలకు విక్రయించొద్దంటూ పోలీసులు ఆయా వ్యాపారులకు సూచనలు, హెచ్చరికలు చేశారు. అయినా కొందరు తమ బుద్ది మార్చుకోకపోవడంతో అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అధిక ధరలకు విక్రయించే దుకాణాలపై నిఘా వేశారు. ఈ మేరకు రెండు రోజులుగా విస్త్రతంగా తనిఖీలు చేస్తూ నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేశారు. 

నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 6 మందిని అరెస్ట్‌ చేశారు. సికింద్రాబాద్‌ ఎస్‌డీ రోడ్డులోని వివేక్‌ అగర్వాల్‌ నిర్వహిస్తున్న అమర్‌ ఇండియ మెడికల్‌ సర్జికల్‌ కంపెనీలో శానిటైజర్లు అధిక ధరలకు విక్రయిస్తుండడంతో నిర్వాహకుడిని అరెస్ట్‌ చేశారు, ఈ దుకాణంలో 32  500ఎంఎల్‌, 200 ఎంఎల్‌ శానిటైజర్‌ బాటిళ్లను, స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్‌ మార్కెట్‌ రోడ్డులో జైహనుమాన్‌ ట్రేడర్స్‌ అండ్‌ కిరాణ, డ్రై ప్రూట్స్‌ షాప్‌ నిర్వాహకుడు బుద్ద అంజయ్య చింతపండు అధిక ధరలకు విక్రయిస్తుండడంతో అతనిని అదుపులోకి తీసుకొని 32 కిలోల చింతపండు స్వాధీనం చేసుకున్నారు. 

ఓల్డ్‌ బోయిన్‌పల్లి హస్మత్‌పేట్‌లోని శివ తేజ కిరాణ అండ్‌ జనరల్‌ స్టోర్‌ నిర్వాహకుడు యెర్రం స్కందకుమార్‌ నూనెలు ఎక్కువ ధరకు విక్రయిస్తుండడంతో అరెస్ట్‌ చేశారు, ఇతని వద్ద నుంచి పప్పులు , నూనెలు స్వాధీనం చేసుకున్నారు. అధిక ధరలకు నిత్యవసర వస్తువులను విక్రయిస్తున్న ముగ్గురు వ్యాపారులను ఆయా పోలీస్‌స్టేషన్లకు తదుపరి విచారణ నిమిత్తం అప్పగించారు. వీరితో పాటు లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారం నిర్వహిస్తున్న ముగ్గురు చిరు వ్యాపారులు శివ శంకర్‌, చాలపబావిలో వీరమ్మ రాజు, రెజిమెంటల్‌ బజార్‌లో ఎస్‌.సందీప్‌లను అరెస్ట్‌ చేసి ఈ ముగ్గురిని గోపాలం పురం పోలీసులకు అప్పగించారు. నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్స్‌పెక్టర్‌ నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సైలు శ్రీకాంత్‌, రాజశేఖర్‌రెడ్డి, పరమేశ్వర్‌ తదితర సిబ్బంది ఈ తనిఖీలలో పాల్గొన్నారు. 

అధిక ధరలకు విక్రయించొద్దు

ఎవరు కూడా ప్రజలకు అవసరమైన నిత్యవసర వస్తువులను అధిక ధరలకు విక్రయించవద్దని టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధకిషన్‌రావు సూచించారు. అధిక ధరలకు విక్రయించే వారిపై నిఘా కొనసాగుతుందని, అలాంటి వారిని పట్టుకొని క్రిమినల్‌ కేసులు నమోదు  చేస్తున్నామన్నారు. దాంతో పాటు లాక్‌డౌన్‌ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కూడా కఠినంగా వ్యహారిస్తున్నామని, నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా బయటకు వస్తే అలాంటి వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. logo