బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 15, 2020 , 10:30:09

మరో మణిహారం మణుగూరు ఓపెన్‌కాస్ట్‌

మరో మణిహారం మణుగూరు ఓపెన్‌కాస్ట్‌

మణుగూరు : సిరులతల్లి సింగరేణి మెడలో మణుగూరు ఓసీ మరో మణిహారంగా మారింది. మణుగూరు ఓపెన్‌కాస్ట్ట్‌లో 18లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి వచ్చింది. 19 రోజుల ముందుగానే సమష్టి కృషితో ఓసీ పనులు నిర్వహించి సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తిని సాధించారు. యావత్‌ సింగరేణికే మణుగూరు ఓసీ బొగ్గు ఉత్పత్తిలో కీలకం కానుంది. 2019-20సంవత్సరానికి 18లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి రోజుకు 5 వేల టన్నుల చొప్పున ప్రతి నెల 1లక్షా 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఓసీలో 18 లక్షల టన్నుల పైచిలుకు బొగ్గు ఉత్పత్తిని సాధించారు. కాగా, గనిలో మట్టి వెలికితీత పనులు కొనసాగిస్తూ ఇప్పటి వరకు 210 లక్షల క్యూబిక్‌ మీటర్లు వెలికితీశారు. 

ఈ గనిని సుమారు రూ. 415 కోట్ల వ్యయం అంచనాతో సుమారు 668 వందల హెక్టార్ల విస్తీర్ణంలో ప్రారంభించగా.. మణుగూరు ఓసీ జీవితకాలం 11 ఏళ్లు కాగా, 17.71 మిలియన్‌ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. ఈ ఓపెన్‌కాస్ట్‌లో 13.7 మిలియన్‌ టన్నుల బొగ్గును తీయనున్నారు. అదేవిధంగా 178 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల మట్టిని వెలికితీయనున్నారు. ఓసీలో 8 సీమ్‌లు ఉండగా, జీ-9 గ్రేడ్‌ బొగ్గు 62శాతం, జీ-12 గ్రేడ్‌ బొగ్గు 38శాతం ఉంది. సింగరేణి సంస్థ సీఅండ్‌ఎండీ శ్రీధర్‌ పర్యవేక్షణలో మణుగూరు ఏరియా జనరల్‌ మేనేజర్‌ జక్కం రమేశ్‌ ఆధ్వర్యంలో మణుగూరు ఓసీ ప్రాజెక్టు ఆఫీసర్‌ డి. లలిత్‌కుమార్‌తో పాటు ఏరియా అధికారులు నిరంతరం శ్రమించి ఓపెన్‌కాస్ట్ట్‌లో 18లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని  19 రోజులు ముందస్తుగా సాధించారు. 

2020-21కు గాను 18లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసేందుకు, 260లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిని వెలికి తీసే విధంగా ఏరియా అధికారులు ప్రణాళిక రూపొందించి అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. ఈ గనిలో 6.5 క్యూబిక్‌ మీటర్ల సామర్థ్యం గల 12 షావల్స్‌ , 52 డంపర్లతో బొగ్గును వెలికి తీస్తున్నారు. మణుగూరు ఓపెన్‌కాస్టుకు గోదావరి పక్కనే ఉండటంతో చుట్టూ 10 మీటర్ల ఎత్తున, 60 మీటర్ల వెడల్పుతో 6 కిలోమీటర్ల పొడవున కరకట్టను నిర్మించారు. కొత్తగా నిర్మించిన కరకట్ట చుట్టూ ప్రత్యేక గార్డెన్‌ నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు ఏరియా అధికారులు తెలిపారు. 


logo