శనివారం 04 జూలై 2020
Telangana - Jun 29, 2020 , 00:04:26

దొర నన్ను43 దేశాలు తిప్పిండు

దొర నన్ను43 దేశాలు తిప్పిండు

పీవీ దేశానికి ప్రధాని అయినా.. అనేక దేశాలు చుట్టివచ్చినా కేవలం ఒకరు వండితేనే ఇష్టంగా తినేవారు. ఢిల్లీలో ఉన్నా, పరసీమలకు వెళ్లినా తోడుగా ఆ వ్యక్తిని తీసుకువెళ్లేవారు. ఆ నలభీముని పేరు  కాల్వ రాజయ్య.  పీవీలాగే తానూ వంగర బిడ్డే. పీవీ సాబ్‌ నేను చేసిన వంటే తినేది. ఇంకెవలు వండినా తినకపోతుండె అని  పెద్దాయనకు మూడు దశాబ్దాలపాటు వంటమనిషిగా పనిచేసిన రాజయ్య  గర్వంగా చెప్పుకుంటారు. ప్రపంచంల 43 దేశాలు సార్‌ పుణ్యమాని తిరిగిన  అంటారు రాజయ్య. పీవీకి ఇష్టమైన వంటలు వండిపెట్టిన రాజయ్యకు పీవీతో అనుబంధం ఆయన మాటల్లోనే..

నాకిప్పుడు 65 ఏండ్లు. నా సగం జీవితం పీవీ సాబ్‌తోనే గడిపిన. నేను చదుకోలేదు. మా తమ్ముడు చిన్నదొర ఇంట్ల (పీవీ సోదరుడు పీవీ మనోహర్‌రావు) పనిచేసేది. వానికి మంచిగలేకపోతే ఇంటికొచ్చిండు. నేను ఇంటికాన్నే మా అవ్వ బాయికాడికి పోతే నేనే వంట చేసేది. మా ఊళ్లో తురుకోళ్ల హోటల్‌లో ఏడేండ్లు హోటళ్ల పనిచేసినంక ఓ రోజు హైదరాబాద్‌ల పెద్దదొర (పీవీ నర్సింహారావు) ఇంట్ల వంటమనిషిగా పనిచేయాలె పోతవా అని అడిగిండ్లు. పోతనని చెప్పిన. తెల్లారే హైదరాబాద్‌కు పోయిన. ముందుగాల వాణీమేడం (పీవీ కూతురు) ఇంట్ల కొన్నిదినాలు పనిచేసిన. పీవీ సాబ్‌ సీఎం పదవి నుంచి దిగిండు. నాకప్పుడు పన్నెండేండ్లు. 

పీవీ సాబ్‌ ఎక్కడికిపోయినా నా వంటే తినేది 

పీవీ సాబ్‌ సీఎం పదవి దిగిపోంగనే ఢిల్లీకి పోయిండు. ఆయననే నన్ను తీస్కపోయిండు. పీవీ సాబ్‌ మంచి నీట్కం మనిషి. ఆయన నిద్రలేచే దాని కంటే ముందు నేను నిద్రలేసి తానం చేసి వంటపని చేసేది. సార్‌ పొద్దుగాల నాస్తా (టిఫిన్‌) చేసేది. పెసరట్టు అంటే మస్తు ఖాయిస్‌గా తినేది. మధ్యాహ్నం పుల్కాలు, అన్నం తినేది. పాలకూర పప్పు, బెండకాయ కూర, బుడత వంకాయ ఇష్టంగా తినేది. స్వీట్లు ఎక్కువ తినకపోయేది. సేమియా పాయసం ఒకట్రెండ్‌ స్పూన్లు. రెండుమూడు రోజులకోసారి కాకరకాయ రసం తాగేది. పాలు మాత్రం పొద్దుకు మూడుసార్ల తాగేది. చాయ్‌లు కూడా బాగానే తాగేది. సోనియా, ప్రణబ్‌, దేవేగౌడ, మన్మోహన్‌సింగ్‌, ఐకే గుజ్రాల్‌, చంద్రశేఖర్‌, వీపీ సింగ్‌ ఇట్ల మస్తు మంది సార్‌ దగ్గరికి వచ్చేది. వాళ్లకు చాయ్‌ పలారం ఇచ్చేది. అందరూ ‘మీ ఇంట్ల చాయ్‌ బాగుంటది’ అంటే అది వంగర టేస్ట్‌ అని పీవీ సాబ్‌ అనేది. ఎకెక్కడికి పోయినా సరే దొర మాత్రం ఇంట్లనే తినేది. బయట తినకపోయేది. సార్‌తోని అన్ని దేశాలు తిరిగిన. 43 దేశాలకు పోయిన. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, తరువాత కూడా సార్‌తోనే ఉన్న. నాకు చిన్నతనాన పెండ్లి అయింది. అయినా కానట్టే. మాకు వాళ్లకు చెడాది అయింది. వద్దనుకున్నం. ఇగనేను మల్ల పెండ్లి చేసుకోలేదు. పీవీ సాబ్‌ 2004ల కాలం చేసినంక కూడా 2014 దాకా ఢిల్లీలనే ఉన్న. పీవీ సాబ్‌ కోటర్స్‌లోనే ఉన్న. వాణీమేడం, ప్రభాకర్‌రావు సాబ్‌, చిన్నదొర, వాళ్ల పిల్లలు ఇట్ల పీవీ సాబ్‌ చుట్టాలు పక్కాలు అందరూ వచ్చేది. అందరికీ నేనే వంటచేసి పెట్టెది. నన్ను ‘రాజీ’ అని సార్‌ పిలిచేది. ఇప్పుడు నాకు ఈ ఇల్లు వాణీమేడమే కట్టిచ్చింది.  

'పీవీ ఏ హోదాలో ఉన్నా సరే.. మంథని వంటకాలంటే ఇష్టంగా తినేవారు. మంథనికి ప్రత్యేకంగా చెప్పుకునే గుమ్మడికాయ బరడా, ముద్దపప్పు, ఉల్లిగడ్డ జుల్క, చల్ల పులుసు, దప్పడం, ఉప్పిడివిండి వంటి వంటకాలంటే పీవీకి మహా ఇష్టం.'

- పీవీ వంటమనిషి కాల్వ రాజయ్య  

-వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ


logo