గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 03:10:23

గజ్వేల్‌కు చేరిన రైలు

గజ్వేల్‌కు చేరిన రైలు

  • మనోహరాబాద్‌ నుంచి గజ్వేల్‌కు ఖాళీ ప్యాసింజర్‌తో ట్రయల్‌ రన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ మనోహరాబాద్‌/గజ్వేల్‌: రైలుబండి కోసం దశాబ్దాలుగా ఎదురుచూసిన గజ్వేల్‌ ప్రజల కల నెరవేరింది. ఆశగా చూసిన ఆ కండ్లలో ఆనందం వెల్లివిరిసింది. తక్కువ సమయంలోనే మనోహరా       బాద్‌-కొత్తపల్లి రైల్వేలైన్‌ గజ్వేల్‌ వరకు పూర్తయి కూ..చుక్‌చుక్‌ అంటూ రైలు కూతపెట్టింది. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు ప్యాసింజర్‌ రైలు పరుగులు తీసింది. మనోహరాబాద్‌ నుంచి గజ్వేల్‌ వరకు 31 కిలోమీటర్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఖాళీ రైలుతో మరోసారి ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఇప్పటికే రైల్వే ట్రాక్‌ నిర్మాణం గజ్వేల్‌ వరకు పూర్తికావడంతో జూన్‌లోనే రైల్వే సేఫ్టీ కమిషనర్‌ తనిఖీలు చేసి అనుమతించారు. లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా సాధారణ రైళ్లు నిలిపివేయడంతో ఈ మార్గంలో కొత్త రైలును నడిపించడం కుదరలేదు. సేఫ్టీ కమిషనర్‌ తనిఖీచేసి సర్టిఫికెట్‌ ఇచ్చిన 90 రోజుల్లోగా రైలును నడిపించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఖాళీ ప్యాసింజర్‌ రైలు ఉదయం 7 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి 10 గంటల ప్రాంతంలో గజ్వేల్‌కు చేరుకున్నది. 11 గంటలకు అక్కడినుంచి తిరిగి కాచిగూడకు బయలుదేరింది. మనోహరాబాద్‌ నుంచి కొత్తపల్లి వరకు రైల్వే పనులకు అయ్యే వ్యయంలో మూడోవంతు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది.

నెరవేరనున్న కల

సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని మెదక్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ ర్యాకల హేమలతా శేఖర్‌గౌడ్‌, రాష్ట్ర ఫుడ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్‌ దాకా ట్రయల్‌ రన్‌ నిర్వహించిన రైలుకు మనోహరాబాద్‌లో కొబ్బరికాయ కొట్టి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వేలైన్‌తో గజ్వేల్‌, సిద్దిపేట, కొత్తపల్లి వరకు అనేక గ్రామాల ప్రజల కల సాకారంకానున్నదని తెలిపారు. ఎంతోమందికి లబ్ధి చేకూరనున్నదని పేర్కొన్నారు. తక్కువ కాలంలోనే రైల్వేపనులు చివరిదశకు చేరుకున్నాయని, గజ్వేల్‌ వరకు పనులు పూర్తయ్యాయని నిర్వహించారని చెప్పా రు. కార్యక్రమంలో రైతుబంధు మండల కో ఆర్డినేటర్‌ యాంజాల సుధాకర్‌రెడ్డి, సర్పంచ్‌ రేణుక ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


logo