శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 03:07:11

పీవీ హయాంలో గొప్ప విజయాలు

పీవీ హయాంలో గొప్ప విజయాలు

  • ఆయన గొప్ప కాంగ్రెస్‌వాది: సోనియాగాంధీ
  • పీవీ కృషి వల్లే ఆధునిక భారతం: రాహుల్‌
  • పీవీ నా గురువు, మార్గదర్శి : మన్మోహన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పీవీ నరసింహారావు గొప్ప నేత, కాంగ్రెస్‌వాది అని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ కొనియాడారు. కాంగ్రెస్‌ పార్టీ.. ఆయన హయాంలో గొప్ప విజయాలు సాధించిందని అన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా టీపీసీసీ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ నేరుగా పాల్గొనలేదు. లేఖలో తమ సందేశాన్ని పంపగా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వాటిని చదివి వినిపించారు. ‘పీవీ విపత్కర సమయంలో ప్రభుత్వ పగ్గాలు చేపట్టి, ఆర్థిక, విదేశాంగ, సామాజిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారు. తన నాయకత్వ పటిమతో దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సవాళ్లను పరిష్కరించారు’ అని సోనియా కొనియాడారు. పీవీ కృషివల్లే ఆధునిక భారతదేశం రూపుదిద్దుకున్నదని రాహుల్‌గాంధీ చెప్పారు. పీవీ 1991లో ప్రవేశపెట్టిన విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలకు శుక్రవారంతో (జూలై 24) 29 ఏండ్లు నిండాయన్నారు.

 మన టైం వస్తే ఎవ్వరూ ఆపలేరని చెప్పేవారు : మన్మోహన్‌

పీవీ నరసింహారావు దేశ సంస్కరణల పితామహుడని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కొనియాడారు. ఆయన గొప్ప విజన్‌తో సంస్కరణలను ప్రవేశపెట్టి, ధైర్యంగా వాటిని అమలుచేశారని అన్నారు. ‘మనకంటూ టైమ్‌ వచ్చినప్పుడు మన ఆలోచలను ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు’ అని పీవీ తనకు చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. టీపీసీసీ వెబినార్‌లో పాల్గొని ఆయన.. పీవీ తనకు స్నేహితుడు, గురువు, మార్గదర్శి అని చెప్పారు. ‘పీవీ హయాంలో రూపొందిన మొదటి వార్షిక బడ్జెట్‌ను 1991లో నేను ప్రవేశపెట్టినందుకు గర్వంగా ఉన్నది. ఆ బడ్జెట్‌ మన దేశంలో ఆర్థిక సంస్కరణలకు, సరళీకరణకు పునాది వేసిందని ఇప్పటికీ కొనియాడుతున్నారు’ అని తెలిపారు. పీవీ ప్రధాని పగ్గాలు చేపట్టేనాటికి దేశం విదేశీ మారక ద్రవ్యం కొరత ఎదుర్కొంటున్నదని, నిల్వలు రెండు వారాల దిగువకు పడిపోయాయని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో దేశం అభివృద్ధి చెందాలంటే ఏం కావాలో పీవీకి స్పష్టమైన అవగాహన ఉన్నదని, అందుకే ధైర్యవంతమైన, కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ఈ విషయంలో ఆర్థికమంత్రిగా తనకు సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. ఆయన విజన్‌ ప్రకారమే తాను పనిచేశానన్నారు.  పీవీ రాజకీయ జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారని అన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనకు వినయపూర్వకంగా నివాళి అర్పిస్తున్నట్టు చెప్పారు. అటు.. సంస్కరణల అమల్లో పీవీ ధైర్యసాహసాలు, ధృడవిశ్వాసాన్ని ప్రదర్శించారని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కొనియాడారు. పీవీ పుట్టిన గడ్డ తెలంగాణలోనే కాకుండా, దేశం మొత్తం ఆయన శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రణబ్‌ పేర్కొన్నారు.


తాజావార్తలు


logo