గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 02:10:20

మాంగనీస్‌, మోలిబ్డినమ్‌ అన్వేషణ

మాంగనీస్‌, మోలిబ్డినమ్‌ అన్వేషణ

  • టీఎస్‌ఎండీసీకి కేంద్రం అనుమతి 
  • ఆదిలాబాద్‌లో మాంగనీస్‌,  కరీంనగర్‌, సిద్దిపేటలో మోలిబ్డినమ్‌ 
  • కరోనా ప్రభావం తగ్గాక పనులు

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: తెలంగాణలో మాంగనీస్‌, మోలిబ్డినమ్‌ ఖనిజాలను అన్వేషించడానికి కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ)కు అనుమతిచ్చింది. ఆదిలాబాద్‌ జిల్లాలో మాంగనీస్‌, కరీంనగర్‌, సిద్దిపేట జిల్లాల్లో మోలిబ్డినమ్‌ ఖనిజాన్ని అన్వేషించి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. తెలంగాణ ఏర్పాటయ్యాక టీఎంఎండీసీకి ఒడిశా, జార్ఖండ్‌ రాష్ర్టాల్లో ఖనిజాల అన్వేషణలో విజయవంతమైన చరిత్ర ఉన్నది. రాష్ట్రంలో ఇప్పటికే ఇసుక తవ్వకాలు, సున్నపురాయి అన్వేషణలో టీఎస్‌ఎండీసీ భారీ ఆదాయాన్ని సమకూరుస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రెండు ఖనిజాల అన్వేషణ బాధ్యతను టీఎస్‌ఎండీసీకి అప్పగించేందుకు కేంద్రం మొగ్గుచూపింది. ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలంలో పింపర్‌కుంట బ్లాక్‌లో మాంగనీస్‌ ఖనిజాల నిల్వలు ఉన్నాయని జీ4 అన్వేషణలో ఇప్పటికే ప్రాథమికంగా తేలింది. ఈ నేపథ్యంలో అక్కడ ఏ మేరకు మాంగనీసు నిల్వలున్నాయి, ఎన్నేండ్లపాటు వెలికితీయవచ్చనే సమగ్ర వివరాలు జీ2 ద్వారా అన్వేషించాల్సి ఉంటుంది. ఇందుకు రూ.1.57కోట్ల వ్యయమవుతుందని అంచనా వేయ గా.. నిధులను నేషనల్‌ మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ట్రస్ట్‌(ఎన్‌ఎంఈటీ) నుంచి కేటాయించారు. ఏడాదిలోగా నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఈ నివేదిక ఆధారంగా కేంద్రప్రభుత్వం ఖనిజాల ధరను నిర్ధారించి వేలం వేయనున్నది. అలాగే చాలా అరుదుగా లభించే, రక్షణ సంబంధ ఆయుధాల్లో వాడే మోలిబ్డినమ్‌ ఖనిజం కరీంనగర్‌, సిద్దిపేట జిల్లాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ ఖనిజాన్ని జీ4 స్థాయిలో సర్వే చేసి కేంద్రానికి నివేదించాల్సి ఉంటుంది. దీనిఅన్వేషణ కోసం రూ.1.73 కోట్లు అవుతాయని అంచనా వేశారు.  అన్వేషణ, పర్యావరణ నివేదికలు తయారుచేస్తారు. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టాక పనులు మొదలుపెట్టాలని టీఎస్‌ఎండీసీ నిర్ణయించింది.logo