ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 13, 2020 , 02:31:10

పసికందు అపహరణ

పసికందు అపహరణ

  • పాపను అడ్డుపెట్టుకొని భిక్షాటనకు ప్లాన్‌
  • 14 గంటల్లోనే తల్లి చెంతకు పసిపాప
  • హైదరాబాద్‌లో ఘటన.. ముగ్గురి అరెస్టు

అబిడ్స్‌, నమస్తే తెలంగాణ: తల్లిఒడిలో వెచ్చగా నిద్రిస్తున్న నాలుగు నెలల పాపను అపహరించిన కేసును మంగళ్‌హాట్‌ పోలీసులు 14 గంటల్లోనే ఛేదించారు. శుక్రవారం అర్ధరాత్రి అపహరణకు గురైన చిన్నారిని శనివారం క్షేమంగా తల్లికి అప్పగించారు. పాపను అడ్డుపెట్టుకొని భిక్షాటన చేయాలనుకున్న నిందితులను జైలుకు పంపించారు. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని సీతారాంబాగ్‌ కట్టెలమండి ప్రాంతానికి చెందిన రాజు, లక్ష్మి దంపతులకు నాలుగునెలల పాప రేణుక సంతానం. రాజు పనులకు వెళ్లినప్పుడు లక్ష్మికి ఆమె తండ్రి శాంతయ్య (65) తోడుగా ఉంటాడు. లక్ష్మి ఇంటి సమీపంలోని కంపౌండ్‌కు వెళ్లి కల్లుతాగే అలవాటు. 

ఈ క్రమంలో లక్ష్మిని ఆర్కేపేట్‌ అల్లబండకు చెందిన ఆటో డ్రైవర్‌ షేక్‌ అలీం (39) పలుమార్లు చూశాడు. అదనుచూసి లక్ష్మి బిడ్డను ఎత్తుకెళ్లాలని ప్లాన్‌చేశాడు. పదో తేదీ అర్ధరాత్రి తర్వాత లక్ష్మి ఇంట్లోకి వెళ్లి తల్లిఒడిలో నిద్రిస్తున్న రేణుకను ఎత్తుకెళ్లాడు. తెల్లవారుజామున నిద్రలేచిన లక్ష్మికి పాప కనిపించకపోవడంతో మంగళ్‌హాట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి ఆ సమయంలో అక్కడ తిరిగిన ఆటో నంబర్‌ గుర్తించారు. దాని ఆధారంగా ఆటో డ్రైవర్‌ షేక్‌ అలీంను బోయిగూడ కమాన్‌ వద్ద శనివారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. అల్లబండలో అతడి ఇంటి వద్ద పోలీసులకు పాప కనిపించింది. షేక్‌ అలీం భార్య అర్శియా (36), అతడి సోదరుడు షేక్‌ సలీం (40) కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందరినీ పోలీస్‌స్టేషన్‌కు తరలించి ప్రశ్నించగా.. పాపను అడ్డుపెట్టుకుని భిక్షాటన చేయాలనుకున్నట్టు పోలీసులకు చెప్పారు. పాపను తల్లికి అప్పగించిన పోలీసులు.. ఆదివారం ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. 


logo