గురువారం 02 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 02:29:01

తెరుచుకోనున్న హోటళ్లు

తెరుచుకోనున్న హోటళ్లు

  • నేటినుంచి మాల్స్‌, రెస్టారెంట్లు కూడా
  • దుస్తుల ట్రయల్స్‌ పూర్తి నిషిద్ధం 
  •  కంటైన్మెంట్‌ జోన్లలో అనుమతిలేదు
  • కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూనే సేవలు
  • ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా లాక్‌డౌన్‌ సడలింపులతో రాష్ట్రంలో రెస్టారెంట్లు, షాపింగ్‌మాల్స్‌ సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తూనే ప్రారంభమయ్యే కార్యకలాపాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వరకు అమలుచేస్తున్నామని, అక్కడ కార్యకలాపాలకు అనుమతి లేదని  సీఎస్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కంటైన్మెంట్‌ ఏరియాలు మినహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్‌కు అనుమతిస్తున్నట్టు తెలిపారు. షాపింగ్‌ మాల్స్‌లో దుస్తుల ట్రయల్స్‌కు, గేమింగ్‌ సెంటర్లు, సినిమాహాల్స్‌కు అనుమతిలేదని స్పష్టంచేశారు. మార్గదర్శకాలను అన్ని సంస్థల యజమాన్యాలు, నిర్వాహకులు పాటించాల్సిందేనని, అతిక్రమిస్తే చట్ట ప్రకా రం కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వు ల్లో పేర్కొన్నారు. ఈ మేరకు స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీడ్స్‌ (ఎస్వోపీ)ని విడుదలచేశారు.

తప్పక పాటించాల్సినవి

ప్రవేశమార్గంలో హ్యాండ్‌వాష్‌ లేదా శానిటైజర్‌ ఏర్పాటుచేయాలి.

ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరించాలి. అందరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించాలి. ఒకేచోట గుమిగూడొద్దు. భౌతికదూరం పాటించేలా చర్యలు చేపట్టాలి.

కరోనాపై అవగాహన కలిగించేలా పోస్టర్లు, ఆడియో, వీడియో ద్వారా సమాచారం అందించాలి.

ఏసీ ఉష్ణోగ్రతలు 24 నుంచి 30 డిగ్రీల మధ్య ఉండేలా చూడాలి.

పరిసరాలను తరచూ శుభ్రపరచడం, శానిటైజ్‌ చేయడం, బాత్రూమ్‌లు, తరచూ తాకే ప్రదేశాలను శుభ్రంగా ఉంచేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి.

లిఫ్ట్‌లలో పరిమిత సంఖ్యలో అనుమతించాలి. ఎస్కలేటర్‌పై ఒక్కో మెట్టుకు ఒక్కరే ఉండేలా చర్యలు తీసుకోవాలి.

రెస్టారెంట్లు పార్సిల్‌ (టేక్‌అవే) తీసుకునే విధానాన్ని ప్రోత్సహించాలి. 50 శాతం సీటింగ్‌ మించకుండా వినియోగదారులను అనుమతించాలి.

హోటళ్లలో వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఫామ్‌లు నింపేలా చూడాలి.

షాపింగ్‌ మాల్‌లోకి పరిమిత సంఖ్యలో వినియోగదారులను అనుమతించాలి.

మాల్స్‌, హోటళ్లు, రెస్టారెంట్లకు వచ్చేవారిలో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే వారిని ప్రత్యేక గదిలో ఉంచాలి. డాక్టర్‌ పరిశీలించే వరకువారికి ఫేస్‌ కవర్‌ ఏర్పాటుచేయాలి. రాష్ట్ర హెల్ప్‌లైన్‌ లేదా జిల్లా హెల్ప్‌ లైన్‌కు లేదా దగ్గరలోని వైద్యకేంద్రాలకు సమాచారం అందించాలి. కార్యకలాపాల నిర్వహణకు  ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆయా సంస్థల నిర్వాహకులు ఏర్పాట్లుచేశారు.

గంటకోసారి తనిఖీలు

20 మంది వెళ్లే లిఫ్ట్‌లో కేవలం ఆరుగురే వెళ్లేలా, అందులోనూ భౌతికదూరం పాటించేలా ప్రత్యేక చిహ్నాలు ఉంటాయి. మాల్‌లో గంటకోసారి తనిఖీలు నిర్వహిస్తాం. ఉదయం 11 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే మాల్స్‌ తెరిచి ఉంటాయి. హైదరాబాద్‌ మెట్రోరైల్‌ పరిధిలోని నాలుగు మాల్స్‌ సోమవారం నుంచి తెరుచుకుంటాయి. కరోనా జాగ్రత్తలు పాటించేందుకు ప్రాధాన్యం ఇస్తాం. వినియోగదారులు మాస్కులు ధరించేలా, భౌతికదూరం పాటించేలా చూస్తాం. 

- ఎన్‌ పార్థసారథి, జీవీకే వన్‌ ఉపాధ్యక్షుడు 


logo