సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 00:54:42

మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రారంభం

మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రారంభం

  • రాష్ట్రంలోనే తొలి ప్రైవేటు విశ్వవిద్యాలయం
  • వర్సిటీ లోగో, బ్రోచర్‌, వెబ్‌సైట్‌ ఆవిష్కరించిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌
  • ఈ ఏడాదే ప్రవేశాలు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

హైదరాబాద్‌/ మేడ్చల్‌, నమస్తే తెలంగాణ/ మేడ్చల్‌ రూరల్‌: రాష్ట్రంలో తొలి ప్రైవేటు యూనివర్సిటీ ప్రారంభమైంది. మల్లారెడ్డి యూనివర్సిటీ ఈ విద్యాసంవత్సరం నుంచే ఎనిమిది కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో వర్సిటీ లోగో, బ్రోచర్‌, వెబ్‌సైట్‌ను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ బుధవారం ఆవిష్కరించారు. భవిష్యత్‌ యువతరానిదేనని, వారికి తగినట్టుగా మరిన్ని యూనివర్సిటీలు రావాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. శాస్త్రసాంకేతిక పురోభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, సామాజిక అవసరాల మేరకు ప్రత్యేక కోర్సులను బోధించాలని సూచించారు. 

రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఐదు ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతిచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని కొనియాడారు. 2020-21 విద్యాసంవత్సరం నుంచే ఎనిమిది కొత్త కోర్సులతో యూనివర్సిటీ ప్రారంభంకానున్నదని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. కొత్తగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌లెర్నింగ్‌, ఇంటర్నెట్‌ థింకింగ్‌, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ, డాటా సైన్స్‌ అండ్‌ డాటా అనాలిసిస్‌, సైబర్‌ సెక్యూరిటీ, కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌, మల్టీమీడియం టెక్నాలజీస్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ వంటి కోర్సులు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. 

రొబోటిక్స్‌, వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీతోపాటు మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఈసీఈ, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ వంటి కోర్సులను కూడా అందించనున్నట్టు వివరించారు. బ్రోచర్‌ విడుదలలో ఎంపీ జీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, జీవన్‌రెడ్డి, ఐటీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, వర్సిటీ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ డీఎన్‌ రెడ్డి, మల్లారెడ్డి విద్యాసంస్థలకు చెందిన చైర్మన్‌, వైస్‌ చాన్స్‌లర్లు పాల్గొన్నారు. అంతకుముందు మల్లారెడ్డి క్యాంపస్‌లో వినోద్‌కుమార్‌ మొక్కలు నాటారు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు జూలై 31 వరకు గడువు

మల్లారెడ్డి యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌, ఎంబీఏ, కామర్స్‌, సైన్స్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల కోసం నోటిఫికేషన్‌ జారీ చేశారు. జూలై 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వర్సిటీ చాన్సులర్‌ ప్రొఫెసర్‌ డీఎన్‌ రెడ్డి తెలిపారు. ఐఐటీ-జేఈఈ/ ఎంసెట్‌/ఇంటర్మీడియట్‌ మార్కులతో మెరిట్‌ జాబితాలు తయారుచేసి ప్రవేశాలు నిర్వహిస్తామని చెప్పారు.


logo