బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 12, 2020 , 12:52:44

ఆదివారాన్ని ఆహ్లాదవారంగా మార్చండి : మంత్రి సత్యవతి రాథోడ్‌

ఆదివారాన్ని ఆహ్లాదవారంగా మార్చండి  : మంత్రి సత్యవతి రాథోడ్‌

హైదరాబాద్‌ : ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు పరిసరాల పరిశుభ్రతలో పాల్గొని ఆదివారాన్ని ఆహ్లాదవారంగా మార్చాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్ కోరారు. ఆదివారం ఆమె హైదరాబాద్‌లోని తన నివాసంలో ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు మీకోసం కార్యక్రమంలో భాగంగా పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం మాట్లాడుతూ వానకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు, దోమలు వ్యాప్తి చెందకుండా ఉండేలా ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అందరూ సహకరించాలని మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతిఒక్కరూ దీనిలో భాగస్వాములు కావాలని ఆమె అన్నారు. భవిష్యత్ తరాలకు ఆస్తులతో పాటు జీవించే వాతావరణాన్ని ఇవ్వడం ముఖ్యమని, సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన హరితహారంలో కూడా అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.  ప్రతి ఒక్కరూ కార్యాలయాలు, ఇండ్లల్లో మొక్కలు నాటాలని కోరారు. 6వ విడత హరితహారాన్ని విజయవంతం చేయాలన్నారు. అదే విధంగా వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండి, అత్యంత జాగ్రత్తగా ఉండాలని, విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, అవసరమైతే తప్ప బయటకు రాకూడదని కోరారు. 


logo