గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 12, 2020 , 02:46:48

గుడ్లు పొదిగే యంత్రం

గుడ్లు పొదిగే యంత్రం

  • తయారుచేసిన దివ్యాంగుడు
  • నిర్మల్‌ జిల్లావాసి అద్భుత ప్రతిభ

ముథోల్‌: అసలే పేద కుటుంబం.. పైగా అంగవైకల్యం.. అయినా, అవేవీ తన ప్రతిభకు అడ్డు కాదని నిరూపించాడో వ్యక్తి. తనకున్న బుద్ధిబలంతో అద్భుతాన్ని సృష్టించాడు. గుడ్లు పొదిగే యంత్రాన్ని తయారుచేసి శెభాష్‌ అనిపించుకున్నాడు. నిర్మల్‌ జిల్లా ముథోల్‌కు చెందిన బొగ్గుల లక్ష్మణ్‌-కళ దంపతుల పెద్ద కుమారుడు మురళి దివ్యాంగుడు. డిగ్రీ వరకు ముథోల్‌లోనే విద్యనభ్యసించాడు. ఇటీవల తన ప్రతిభతో కోడి లేకుండా గుడ్లు పొదిగే యంత్రాన్ని తయారుచేశాడు. ఇందుకు కేవలం రూ.3,600 ఖర్చు చేశాడు. ఈ కోళ్లు పొదిగే ఇంక్యుబేటర్‌ ద్వారా గుడ్లు 10 శాతం మేర మాత్రమే పాడయ్యే అవకాశం ఉందని, 90 శాతం పిల్లలు పుడుతాయని ఈ యువకుడు చెప్తున్నాడు.

తయారీ ఇలా..

గుడ్లు పొదిగే యంత్రం తయారీకి థర్మకోల్‌ షీట్లు, చెక్క, రెండు 60 వోల్టేజీ బల్బులు, కూలింగ్‌ ఫ్యాన్‌, థర్మోస్టాటర్‌, వాటర్‌బాక్స్‌ను ఉపయోగించాడు. మూడు అడుగుల వెడ ల్పు, రెండు అడుగుల వైశాల్యంలో దీన్ని రూపొందించాడు. తొలిసారి ఇందులో 8 గుడ్లు పొదుగు వేయగా ఏడు పిల్లలు, రెండోసారి 30 గుడ్లకు 26 పిల్లలు వచ్చాయని తెలిపాడు. ప్రస్తుతం 33 గుడ్లు పొదిగేసినట్లు వివరించాడు. దీనికి కచ్చితంగా 24 గంటలు కరెంటుఉండాలని, లేకుంటే గుడ్లు పాడవుతాయని తెలిపాడు. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు పొదిగే కోడిని అందుబాటులో ఉంచుతానని వెల్లడించాడు.

చేయూతనిస్తే తయారు చేసిస్తా..

కోడిగుడ్లు పొదిగే యంత్రానికి రూ.3,600 నుంచి 4వేల వరకు ఖర్చవుతుంది. చేయూతనిస్తే అవసరమున్నవారికి తయారుచేసిస్తా. అవసరమైతే మరింత అభివృద్ధి చేస్తా. నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా తయారు చేయాలనే ఆలోచన ఉండేది. అది ఇప్పుడు నెరవేరింది.

-మురళి


logo