బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 02, 2020 , 19:31:15

కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం..

కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం..

హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా వైరస్‌ నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. కోఠిలోని వైద్య సంచాలకుల కార్యాలయంలో ఆరోగ్య శాఖ అధికారులతో ఈటల రాజేందర్‌ సమావేశమై కరోనా వైరస్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇక గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో అడ్మిట్‌ అయిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆరోగ్య పరిస్థితిపై కూడా మంత్రి చర్చించారు. అనంతరం మంత్రి ఈటల రాజేందర్‌ మీడియాతో మాట్లాడారు. 

బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తున్న 24 ఏళ్ల యువకుడు.. ఫిబ్రవరి 15న దుబాయ్‌ వెళ్లాడు. కంపెనీ పని నిమిత్తం దుబాయ్‌ వెళ్లిన ఆ ఉద్యోగి.. ఇతర దేశాలు, ప్రాంతాలకు చెందిన వ్యక్తులతో కలిసి అక్కడ పని చేశాడు. ఫిబ్రవరి 20న తిరిగి బెంగళూరుకు చేరుకున్నాడు. 27న జ్వరం రావడంతో.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. అదే రోజు సికింద్రాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చేరాడు. డాక్టర్లు ట్రీట్‌మెంట్‌ చేసినప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో టెస్టులు చేయించుకోవాలని సూచించారు. దీంతో మార్చి 1న సాయంత్రం 5 గంటలకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.. గాంధీ ఆస్పత్రిలో చేరాడు. అతనికి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్‌గా ఫలితం వచ్చింది. నిర్ధారణ కోసం పుణెకు కూడా పంపించం.. అక్కడ కూడా పాజిటివ్‌ ఫలితాలే వచ్చాయి. ఇదే విషయాన్ని కేంద్రానికి తెలిపాం. ప్రస్తుతం బాధిత వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. 

ఇక బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ప్రయాణించిన బస్సులో మొత్తం 27 మంది ప్రయాణికులు ఉన్నారు. వారితో పాటు సికింద్రాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స అందించిన డాక్టర్లు, నర్సులు, ఇతరుల వివరాలు తీసుకున్నాం. కుటుంబ సభ్యుల వివరాలను కూడా సేకరించాం. మొత్తంగా 80 మంది దాకా ఉన్నారు. వీరందరికి కరోనా టెస్టులు చేస్తామని మంత్రి తెలిపారు. వీరందరికి వైరస్‌ సోకినట్లు కాదు.. నిర్ధారణ కోసమే అని ఆయన చెప్పారు. 

హైదరాబాద్‌లోని గాంధీ, ఫీవర్‌, చెస్ట్‌ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డుల్లో 40 పడకలను అందుబాటులో ఉంచామని మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ఆస్పత్రుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపే ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ఇక మంగళవారం మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై కరోనా వైరస్‌పై చర్చిస్తామన్నారు. 

ప్రతి ఒక్కరూ ముక్కుకు గుడ్డ కట్టుకోవాలి

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లినప్పడు విధిగా ముక్కుకు గుడ్డ కట్టుకోవాలని మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో దగ్గడం, తుమ్మడం మానుకోవాలి. జ్వరం, జలుబు, దగ్గు ఉంటే తప్పనిసరిగా వైద్యుడి దగ్గరకు వెళ్లి చికిత్స చేయించుకోవాలని మంత్రి చెప్పారు. ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.


logo
>>>>>>