శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 15:21:10

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్‌ ముషారఫ్‌

నిర్లక్ష్యం వహిస్తే  చర్యలు తప్పవు: కలెక్టర్‌ ముషారఫ్‌

నిర్మల్‌: జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలో కలియదిరుగుతూ వార్డులను పరిశీలించారు. గర్భినీలకు, బాలింతలకు, పసి పిల్లలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఈ సందర్భంగా కలెక్టర్‌.. వైద్యులకు సూచించారు. ఆస్పత్రిలో నిర్వహిస్తున్న రికార్డులను ఆయన పరిశీలించారు. హెల్ప్‌డెస్క్‌ వద్ద డెలివరీ రిజస్టర్‌, గర్భినీ స్త్రీలు, వారిని ఆస్పత్రికి తీసుకువచ్చే ఆశావర్కర్ల వివరాలు నమోదు చేయడానికి ప్రత్యేక రిజిస్టర్‌ నిర్వహించాలని కలెక్టర్‌.. వైద్య సిబ్బందికి సూచించారు. ఆస్పత్రికి వచ్చిన మహిళలను ఆత్మీయంగా పలకరించిన కలెక్టర్‌.. అక్కడ అందుతున్న వైద్యసేవలను వారిని అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా కలెక్టర్‌ వైద్యులతో మాట్లాడుతూ.. గర్భినీలు, బాలింతల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వారి పట్ల మర్యాదగా నడుచుకోవాలని వైద్యులకు సూచించారు. ఆస్పత్రిలో ప్రతినెలా 300 ప్రసవాలు జరగాలనీ.. ఆ విధంగా సౌకర్యాలు కల్పించాలని అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరికలు జారీ చేశారు. కాగా, అంతకు ముందు కలెక్టర్‌ ఫారూఖీ.. పట్టణంలోని ధర్మసాగర్‌ చెరువును సందర్శించారు. చెరువులో ఉన్న గుర్రపుడెక్కను తొలగించాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు.  

ఈ సందర్భంగా కలెక్టర్‌తో పాటు డాక్టర్‌ రజిని, మున్సిపల్‌ కమిషనర్‌ ఎన్‌. బాలకృష్ణ, తహసీల్దార్‌ సుభాష్‌ చందర్‌, మున్సిపల్‌ డీఈ సంతోష్‌ కుమార్‌, కౌన్సిలర్‌ మహమ్మద్‌ సలీం తదితరులు ఉన్నారు. 


logo