శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 18:04:45

జనతా కర్ఫ్యూ పాటిద్దాం.. కరోనాను జయిద్దాం: మంత్రి హరీష్‌

జనతా కర్ఫ్యూ పాటిద్దాం.. కరోనాను జయిద్దాం: మంత్రి హరీష్‌

హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు రేపు జనతా కర్ఫ్యూ పాటించి, కరోనా వైరస్‌ను నిలువరిద్దామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కరోనాపై యుద్దం కొనసాగిద్దామని మంత్రి తెలిపారు. కరోనాను జయించడంలో రాష్ట్రం.. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా కృషి చేయాలని ప్రజలనుద్దేశించి మంత్రి అన్నారు. సీఎం కేసీఆర్‌ తెలిపినట్లు రాష్ట్రంలో 24 గంటలు జనతా కర్ఫ్యూ పాటించాలని మంత్రి ప్రజలకు విన్నవించారు. రేపు ఇంట్లో ఉంటే మనం సమాజానికి సేవ చేసినట్లేనని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. విదేశాల నుంచి వచ్చే వారి సమాచారం ప్రభుత్వానికి తెలియజేయాలని మంత్రి హరీష్‌రావు సూచించారు. 

చికిత్స కన్నా నివారణే మేలని మంత్రి తెలిపారు. స్వీయ నియంత్రణతోనే ఈ మహమ్మారి వైరస్‌ను అడ్డుకోవచ్చని వెల్లడించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఎవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని తెలిపారు. కావాల్సిన నిత్యావసర వస్తువులు ముందుగానే సమకూర్చుకోవాలని సూచించారు. నిత్యం శానిటైజర్స్‌, సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలనీ.. దగ్గు, జలుబు లక్షణాలు కనిపిస్తే అలక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని మంత్రి సూచించారు. 

విదేశాల నుంచి వచ్చే వారికే ఈ వ్యాధి లక్షణాలున్నాయనీ, విదేశాల నుంచి ఎవరు వచ్చినా స్వచ్చందంగా ప్రభుత్వానికి సమాచారమివ్వాలనీ, అలాగే వైద్య పరీక్షలు సైతం చేయించుకోవాలని మంత్రి హరీష్‌ రావు ఈ సందర్భంగా తెలిపారు. 


logo