బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Oct 22, 2020 , 01:26:19

సమర్థ పోలీసింగ్‌తో నేరరహిత తెలంగాణ

సమర్థ పోలీసింగ్‌తో నేరరహిత తెలంగాణ

  • పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో హోంమంత్రి మహమూద్‌ అలీ 
  • రాష్ట్రవ్యాప్తంగా ఒకే తరహా పోలీస్‌ సేవలు: డీజీపీ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సమర్థ పోలీసింగ్‌ అమలు, సాంకేతికత జోడింపుతో రాష్ట్రం నేర రహితంగా మారుతున్నదని హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణదినం సందర్భంగా ఎల్బీ ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌అలీ, డీజీపీ మహేందర్‌రెడ్దితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా అమరుల స్మారక స్థూపానికి నివాళులర్పించారు. హోం మంత్రి మాట్లాడుతూ.. ఆరేండ్లలో రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గాయని, హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉన్నదని పేర్కొన్నారు. రాజధాని నగరంలో మూడున్నర లక్షల సీసీటీవీ కెమెరాలతో నిరంతరం నిఘా పెడుతున్నట్టు తెలిపారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, షీటీమ్స్‌ నిరంతరం అందుబాటులో ఉంటున్నాయని పేర్కొన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ‘ఒకే రాష్ట్రం-ఒకే రకమైన సేవ’అన్న విధానాన్ని పోలీసుశాఖలో అమలు చేయనున్నట్టు తెలిపారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, వ్యవస్థీకృత నేరాలను అదుపునకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. కరోనా, భారీ వర్షాలు తదితర విపత్తుల సమయంలో పోలీసులు అందిస్తున్న సేవలకు ప్రజల నుంచి ప్రశంసలు అందుతున్నాయని పేర్కొన్నారు. ఈనెల 31 వరకు పోలీస్‌ ఫ్లాగ్‌డేను  నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా హోంమంత్రి  అమరవీరుల వివరాలతో కూడిన ‘అమరులు వారు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఫ్లాగ్‌డే సంక్షేమ నిధి విరాళాల సేకరణను ప్రారంభించారు. అటు.. పోలీస్‌ సంస్మరణ దినం సందర్భంగా పోలీసుల సేవలను కొనియాడుతూ అనంత్‌ శ్రీరామ్‌ రాసిన ‘మనలో మనలా.. మనతో మనకై..’ పాటను స్వరపర్చి, స్వయంగా పాడారు కీరవాణి.  ఈ పాటను డీజీపీ మహేందర్‌రెడ్డి తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేసి, కీరవాణి, అనంత్‌శ్రీరామ్‌, ఎడిట్‌ చేసిన హైమారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.