శనివారం 11 జూలై 2020
Telangana - Jun 15, 2020 , 01:53:18

పరిమళించిన మానవత్వం

పరిమళించిన మానవత్వం

  • మతిస్థిమితంలేని వ్యక్తిని ఇంటికి చేర్చిన ఏఎస్సై
  • ఆనందంలో మహిపాల్‌ కుటుంబ సభ్యులు 

పాపన్నపేట: తినడానికి తిండి లేక బతుకుదెరువు కోసం పట్నం వెళ్తూ.. మార్గమధ్యంలో తప్పిపోయి మతిస్థిమితం కోల్పోయిన ఓ యువకుడిని తల్లిదండ్రులకు అప్పగించి మానవత్వం చాటుకున్నారు మెదక్‌ జిల్లా పాపన్నపేట ఏఎస్సై నర్సింహులు. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ఆడేగావ్‌  గ్రామానికి చెందిన మహిపాల్‌ తినడానికి తిండి లేక పస్తులు ఉంటున్నాడు. అతడిని పనిలో పెట్టిస్తానని ఓ వ్యక్తి హైదరాబాద్‌ తీసుకెళ్తుండగా, మహిపాల్‌ మార్గమధ్యంలో దిగి తప్పిపోయాడు. ఇదంతా మూడున్నర నెలలక్రితం జరిగింది. మెదక్‌ జిల్లా అందోల్‌ మండ లం సంగుపేట బస్‌షెల్టర్‌కు చేరుకుని అప్పటినుంచి అక్కడే ఉంటున్నాడు. ఎవరైనా దయతలచి అన్నం పెడితే తింటూ జీవనం సాగిస్తున్నాడు. పెరిగిన గడ్డం, చిరిగిన దుస్తులతో ఉండటంతో అందరూ పిచ్చివాడిగా భావిస్తున్నారు. శుక్రవారం పాపన్నపేట ఏఎస్సై నర్సింహులు పాపన్నపేట నుంచి సంగారెడ్డికి వెళ్తూ సంగుపేట బస్‌షెల్టర్‌ వద్ద మహిపాల్‌ను చూసి అతనితో మాట్లాడారు. తన పేరు మహిపాల్‌ అని, తనది ఆదిలాబాద్‌ జిల్లా అని మాత్రమే చెప్పాడు. వెంటనే ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్‌కు ఫోన్‌ చేసి.. అక్కడ ఎవరైనా తప్పిపోయారా? అని ఆరాతీశారు. మహిపాల్‌ ఫొటో పంపి, గ్రామ సేవకుల ద్వారా వివరాలు సేకరించాలని కోరారు. ఫొటో ఆధారంగా అతడు ఇచ్చోడకు చెందిన యువకుడిగా నిర్ధారణ య్యింది. దీంతో అదే రాత్రి మహిపాల్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, సంగుపేటకు రావాల్సిందిగా సూచించారు. మహిపాల్‌కు కటింగ్‌, గడ్డం తీయించి, స్నానం చేయించి, కొత్త దుస్తులు వేయించారు. కుటుంబసభ్యులు రాగానే అతడిని వారికి అప్పగించి ఖర్చుల కోసం రూ.వెయ్యి ఇచ్చి పంపించి మానవత్వాన్ని చాటుకున్నారు. సదరు కుటుంబ సభ్యులు ఏఎస్సై నర్సింహులుకు కృతజ్ఞతలు తెలిపారు.


logo