శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 03:07:12

రాబోయే తరాలు మెరవాలి

రాబోయే తరాలు మెరవాలి

  • ఐక్యూ, ఈక్యూ మీద దృష్టి సారించాలి
  • ఉన్నత విద్యలో ప్రమాణాలు పెరగాలి
  • మహీంద్రా విశ్వవిద్యాలయంప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌
  • నాయకులను తయారుచేస్తాం: ఆనంద్‌ మహీంద్రా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాబోయే తరాలు సాంకేతికంగా మెరుగ్గా తయారవ్వాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గపరిధిలోని బహాదూర్‌పల్లిలో ఏర్పాటు చేసిన మహీంద్రా యూనివర్సిటీ ప్రారంభోత్సవంలో ఆయన వెబినార్‌ ద్వారా పాల్గొన్నారు. మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రాతో కలిసి వర్సిటీని ప్రారంభించి మాట్లాడుతూ.. మహీంద్రా సంస్థ ఏర్పా టు చేసిన ఈ వర్సిటీ విద్యార్థుల్లో అత్యుత్తమ ప్రతిభను వెలికితీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజంలోని వివిధ సమస్యలకు వర్సిటీ పరిష్కారం చూపుతుందని, పారిశ్రామిక అవసరాలను తీర్చుతుందని అన్నారు. మేధస్సు సూచి (ఐక్యూ), భావావేశ సూచి (ఈక్యూ) మీద దృష్టి పెట్టాలని వర్సిటీ అధికారులకు కేటీఆర్‌ సూచించారు. విద్య తో పాటు  క్రీడలు, మ్యూజిక్‌, ఇతర అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. ఉన్నత విద్యలో ప్రమాణాలు పెరగాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ప్రసుత్త సమాజ అవసరాలను తీర్చడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తున్నదని తెలిపారు. ఆనం ద్‌ మహీంద్రా మాట్లాడుతూ.. ఈ వర్సిటీ రాబో యే తరం నాయకులను తయారు చేస్తుందన్నారు. 130 ఎకరాల్లో వర్సిటీని ఏర్పాటు చేసినట్టు ఆయ న వెల్లడించారు. ఇందులో 2014 నుంచి సెంట్రల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ను కొనసాగిస్తున్నామని, పీజీ, పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. టెక్‌ మహీంద్ర సీఈవో, ఎండీ సీపీ గుర్నానీ మాట్లాడుతూ రాబో యే ఐదేండ్లలో ఈ యూనివర్సిటీలో నాలుగువేల మంది విద్యార్థులు, 300 మందికి పైగా బోధనాసిబ్బంది ఉంటారని అన్నారు. యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ యాజులు మేడురి మాట్లాడుతూ వర్సిటీలో ఇంజినీరింగ్‌, న్యాయ, మేనేజ్‌మెంట్‌, విద్య, మీడియా, ఆర్ట్స్‌, డిజైన్‌ సంబంధిత అంశాలు బోధించనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహీంద్ర ఎడ్యుకేషనల్‌ బోర్డు చైర్మన్‌ వీనిత్‌ నాయర్‌, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్‌, ఐటీ పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, మహీంద్రా గ్రూప్‌ యూనివర్సిటీని ఏర్పాటుచేయటం ప్రశంసనీయమని మహీంద్రా కు పంపిన లేఖలో ప్రధాని మోదీ కొనియాడారు.  logo