శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 03:12:54

వీరుడా.. అమర్‌ రహే..

వీరుడా.. అమర్‌ రహే..

  • జవాన్ల అమరత్వంతో శోకిస్తున్న తెలుగు రాష్ర్టాలు
  • జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరులో ర్యాడ మహేశ్‌, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వీరమరణం
  • నిజామాబాద్‌, చిత్తూరు జిల్లాల్లో విషాద ఛాయలు
  • మహేశ్‌కు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నివాళులు 
  • కోమన్‌పల్లికి వెళ్లి కుటుంబీకులకు పరామర్శ
  • వీర సైనికులకు నివాళులర్పించిన ఎమ్మెల్సీ కవిత
  • స్వగ్రామంలో నేడు మహేశ్‌ అంత్యక్రియలు

చిమ్మ  చీకటి. భయపెట్టే నిశ్శబ్దం. అసలే కల్లోల కశ్మీరం. శత్రువు ఏ మూలనుంచైనా రావచ్చు. అందుకే కొన్ని కండ్లు తీక్షణంగా పరిసరాలను గమనిస్తున్నాయి. ఆకురాలిన శబ్దాన్నీ ఆ చెవులు గ్రహిస్తున్నాయి. కఠోర శిక్షణతో ప్రకృతిని, పరిసరాలను ఆవాహన చేసుకున్న వీరాగ్రేసరులు రెప్ప వేయకుండా భరతమాతను కాపలా కాస్తున్నారు. అంతలో.. ఎండుటాకులు నలిగిన చప్పుడు. ఏవో ఆకారాలు కదులుతున్న ఆనవాళ్లు. అర్ధరాత్రి అక్కడ సామాన్య ప్రజలు ఉండరని సైనికులకు తెలుసు. ఆలస్యం చేయలేదు. చప్పుడు వచ్చిన వైపు దూసుకుపోయారు. ధన్‌.. ధన్‌.. ధన్‌.. తుపాకుల గర్జన. మనదేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఓ ముష్కరుడు మట్టికరిచాడు. ఒక భారత వీరుడు కూడా నేలకొరిగాడు. అంతలో తుపాకుల మోత ఆగింది. ఉగ్రవాదులు పారిపోయారనుకున్నారు. కానీ అది శత్రువు ఏమార్పు. నాలుగు గంటలు చీకట్లో నక్కిన ముష్కరులు కూతవేటుదూరంలో మళ్లీ కదిలారు. మళ్లీ భీకర పోరు. ఇద్దరు జవాన్లు శత్రువు తుపాకీ గుండ్లు తమ దేహాన్ని చీల్చుతున్నా లెక్కచేయకుండా దూసుకుపోయారు. ముగ్గురు ముష్కరుల శరీరాలను తుపాకీ గుండ్లతో తూట్లు పొడిచారు. కర్మభూమికి చివరి సలాం చేస్తూ భరతమాత ఒడిలోకి ఒరిగిపోయారు. వారే.. ఆదివారం జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో జరిగిన ఎన్‌కౌంటర్లో వీరమరణం పొందిన తెలుగు సైనికులు ర్యాడ మహేశ్‌, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి. మహేశ్‌ స్వస్థలం తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాకాగా, ప్రవీణ్‌కుమార్‌రెడ్డిది ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా.

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ:  అది నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లిలో మహేశ్‌ ఇల్లు. అంతా ఉద్విగ్న వాతావరణం. మహేశ్‌ మరణవార్త మోపిన బాధను పంటికింద భరిస్తున్న కుటుంబసభ్యులు! ఒక్కొక్కరుగా ఇంటికి వస్తున్న బంధువులు! ప్రాణంగా ప్రేమించి పెండ్లి చేసుకున్న తన భర్తకు ఏమైంది? అక్కా.. మహేశ్‌కు ఏమైంది? అంటూ తోడికోడలును మహేశ్‌ భార్య సుహాసిని దీనంగా అర్థిస్తుంటే ‘దెబ్బలు తగిలాయి.. దవాఖానలో ఉన్నాడు..’ అని మాత్రమే ఇంట్లోవాళ్లు చెప్పగలిగారు! కానీ.. పెల్లుబుకుతున్న దుఃఖాలు ఆమెకు జరిగిన ఘోరాన్ని చెప్పకనే చెప్పాయి! అంతే ఆ ఇల్లాలు కుప్పకూలిపోయింది.  

ఏడాదిన్నర క్రితమే పెండ్లి

హైదరాబాద్‌కు చెందిన సుహాసినిని మహేశ్‌ ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. సుహాసిని బాబాయి కూడా ఆర్మీలోనే పనిచేస్తున్నారు. ఓ సందర్భంలో సుహాసినితో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. నాలుగేండ్ల ప్రేమ తర్వాత పెద్దలను ఒప్పించి  ఏడాదిన్నర క్రితం పెండ్లి చేసుకున్నారు. హాయిగా సాగిపోతున్న జీవితంలో అనుకోని కుదుపు ఆమెను కన్నీటిసాగరంలో ముంచేసింది.

నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ కవిత

మహేశ్‌ ప్రాణత్యాగం భారతీయలందరికీ స్ఫూర్తిదాయకమని ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆయన కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకొని అమరుడైన మహేశ్‌కు నివాళి అంటూ ట్వీట్‌ చేశారు. వీర జవాన్‌ కుటుంబానికి తెలంగాణ జాతి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మహేశ్‌ కుటుంబసభ్యులకు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

కన్నీటిపర్యంతమైన మంత్రి వేముల

మహేశ్‌కు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సోమవారం ఘనంగా నివాళులర్పించారు. కోమన్‌పల్లిలో ఆయన తల్లిదండ్రులను ఓదార్చారు. నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయలతో కలిసి ధైర్యం చెప్పారు. మహేశ్‌ ప్రాణత్యాగాన్ని గుర్తుచేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకుంటుందని మహేశ్‌ కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు.పుట్టిన రోజుకు వస్తానని..

ఈ నెల 5న సుహాసిని పుట్టినరోజు సందర్భంగా వీడియో కాల్‌ ద్వారా మహేశ్‌ శుభాకాంక్షలు చెప్పాడు. ఈ నెల 21న మహేశ్‌ పుట్టినరోజు ఉండటంతో ఇంటికి వస్తానని భార్యకు మాటిచ్చాడు. శనివారం మధ్యాహ్నం భార్యతో మాట్లాడిన సందర్భంలోనూ ‘వారం రోజుల్లోనే వస్తా... దీపావళి పండుగను ఘనంగా జరుపుకొందాం’ అని చెప్పాడు. అంతలోనే ఉగ్రవాదుల కాల్పుల్లో మహేశ్‌ వీర మరణం పొందాడన్న వార్తతో సుహాసినిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. మహేశ్‌ వయసు 26 ఏండ్లే. 21 ఏండ్లకే సైన్యంలో జవాన్‌గా చేరాడు. ఆయన తల్లిదండ్రులు గంగుమల్లు, రాజుభాయ్‌లకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కొడుకు భూమేశ్‌ గల్ఫ్‌లో ఉన్నారు.  

అసమాన వీరుడు హవల్దార్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి

కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్లో శత్రువును దునుమాడుతూ వీరమరణం పొందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అసమాన వీరుడిగా పేరు తెచ్చుకున్నారు. హవల్దార్‌ హోదాలో సైన్యంలో విధులు నిర్వహిస్తున్న ఆయన ఇటీవలే అత్యంత కఠినమైన కమెండో శిక్షణను కూడా పూర్తిచేసుకున్నారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లె ప్రవీణ్‌కుమార్‌రెడ్డి స్వస్థలం. గత 18 ఏండ్లుగా ఆయన భారత సైన్యంలో భాగమైన మద్రాస్‌ రెజిమెంట్‌లో పనిచేస్తున్నారు. ఆయనకు భార్య రజిత, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మరణవార్తతో ఆయన భార్యాపిల్లలతోపాటు తల్లిదండ్రులు ప్రతాప్‌రెడ్డి, సుగుణమ్మ గుండెలవిసేలా విలపిస్తున్నారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రూ.50లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.