బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 00:47:35

50 వేల ఎకరాలకు ఉల్లిసాగు

50 వేల ఎకరాలకు ఉల్లిసాగు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో అవసరానికి అనుగుణంగా ఉల్లిగడ్డ ఉత్పత్తిపై ఉద్యానశాఖ దృష్టి సారించింది. ఉల్లి పంట సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇందుకోసం మహారాష్ట్రలోని నేషనల్‌ హార్టికల్చర్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్డీఎఫ్‌) సహకారం తీసుకోనున్నది. ఉల్లి సాగుకు సంబంధించి తెలంగాణ నేలలపై ఈ సంస్థ పరిశోధనలు నిర్వహించింది. రాష్ట్రంలోని మెజార్టీ ప్రాంతాల్లోని నేలలు ఉల్లిసాగుకు అనుకూలమని తేల్చింది. ఈ నేలలకు సరిపోయేలా విత్తనాన్ని కూడా అభివృద్ధి చేసింది. ఈ విత్తనాలను ఉపయోగించి రాష్ట్రంలో ఉల్లిసాగును పెంచేందుకు ఉద్యానశాఖ అధికారులు ఇటీవల మహారాష్ట్రలో పర్యటించారు. ఎన్‌హెచ్‌ఆర్డీఎఫ్‌ పరిశోధనా కేంద్రంతోపాటు రైతుల వద్దకు వెళ్లి ఉల్లిసాగు విధానాన్ని పరిశీలించి.. వివరాలు తెలుసుకున్నారు. 

ఉల్లి ధరలపై మహారాష్ట్ర ప్రభావం

ఉల్లిసాగులో మహారాష్ట్ర దేశంలోనే నంబర్‌వన్‌గా ఉన్నది. ఆ రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో ఉల్లి సాగవుతుంది. దాదాపు దేశం మొత్తానికి మహారాష్ట్ర నుంచే సరఫరా అవుతుంది. దీంతో అధిక వర్షాలు, ప్రకృతి విపత్తుల్లో ఆ రాష్ట్రంలో ఉల్లి పంట దెబ్బతింటే ఆ ప్రభావం దేశం మొత్తమ్మీద ఉంటున్నది. ఒక్కసారిగా ధరలు పెరిగి వినియోగదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఏటా 5.14 లక్షల టన్నుల ఉల్లిగడ్డ అవసరంకాగా.. రాష్ట్రంలో పండుతున్నది 2 లక్షల టన్నులు మాత్రమే. కేవలం 18వేల ఎకరాల్లో మాత్రమే పంట సాగుతున్నది. ఈ నేపథ్యంలో ఉల్లి అవసరాలు తీర్చేలా సాగును 50 వేల ఎకరాలకు పెంచాలని ఉద్యానశాఖ యోచిస్తున్నది. వరితో పోల్చితే ఉల్లిసాగు ఎంతోమేలని ఎన్‌హెచ్‌ఆర్డీఎఫ్‌ సూచిస్తున్నదని ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. ఎకరం వరిసాగుకు అవసరమయ్యే నీటితో 8 ఎకరాల్లో ఉల్లిని సాగుచేయొచ్చని చెప్తున్నారు. వరి కంటే అధిక ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతులను ఉల్లిసాగువైపు మళ్లించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.