మంగళవారం 19 జనవరి 2021
Telangana - Dec 29, 2020 , 01:50:05

అమెరికాలో మానుకోటవాసి మృతి

అమెరికాలో మానుకోటవాసి మృతి

మహబూబాబాద్‌: ప్రమాదవశాత్తు కిందపడి మహబూబాబాద్‌కు చెందిన యువకుడు అమెరికాలోని టెక్సాస్‌లో మృతిచెందాడు. మహబూబాబాద్‌ పట్టణంలోని కంకరబోడు కాలనీకి చెందిన గొట్టం శ్రీనివాసరెడ్డి-శోభారాణి దంపతుల కుమారుడు చంద్రపాల్‌రెడ్డి(26) ఉన్నత విద్య కోసం 2015లో టెక్సాస్‌కు వెళ్లాడు. ఎంఎస్‌ పూర్తి చేశాక అక్కడే ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం లభించింది. ఉద్యోగం చేస్తూనే పీహెచ్‌డీ చదువుతున్నాడు. కొవిడ్‌-19 నేపథ్యంలో చంద్రపాల్‌రెడ్డి ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఇటీవల మరో కంపెనీలో ఉద్యోగం రావడంతో ఈ నెల 22న అమెరికాలో ఉన్న తన స్నేహితులకు ఓ క్లబ్‌లో పార్టీ ఇచ్చాడు. ఆ సమయంలో చంద్రపాల్‌రెడ్డి ప్రమాదవశాత్తు కిందపడిపోగా తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడిని స్థానిక దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. తన కొడుకు మృతదేహాన్ని ఇండియాకు రప్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌లకు మృతుడి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.