గురువారం 02 జూలై 2020
Telangana - Jun 22, 2020 , 01:27:07

విద్యార్థుల ఇంటికే..మధ్యాహ్న భోజన బియ్యం

విద్యార్థుల ఇంటికే..మధ్యాహ్న భోజన బియ్యం

  • వంటఖర్చులు కూడా చెల్లింపు!
  • కరోనా ప్రభావంతో ప్రారంభం కాని స్కూళ్లు
  • బియ్యం పంపిణీపై కేంద్రం యోచన
  • రాష్ర్టాలకు లేఖ.. ప్రతిపాదనలు సిద్ధం చేసిన విద్యాశాఖ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వల్ల విద్యారంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పటికే పలు పరీక్షలు రద్దయ్యాయి. కొత్త విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియని పరిస్థితి. సర్కారు బడులు మొదలైతే మధ్యాహ్న భోజనం వల్ల పేద విద్యార్థుల ఆకలి తీరేది. ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజనానికి సంబంధించి బియ్యాన్ని విద్యార్థుల ఇండ్లకే పంపిణీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ మేరకు కేంద్రం అన్ని రాష్ర్టాలకు లేఖ రాసింది. రాష్ట్రంలో విద్యార్థులకు సన్నబియ్యం పెడుతున్నందున ఆ బియ్యాన్నే సర్కారు బడుల్లో చదువుతున్న 24 లక్షల మంది విద్యార్థులకు పంపిణీ చేయడంపై రాష్ట్ర సర్కారుకు విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. 

ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే విద్యార్థుల ఇండ్లకు సన్నబియ్యం పంపిణీపై మార్గదర్శకాలు రూపొందించి, డీఈవోలకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఈ పద్ధతిని జూన్‌ లేదా జూలైనుంచి అమలుచేసే అవకాశాలున్నా యి. ప్రతి విద్యార్థికి నెలకు మూడు కిలోలకుపైగా సన్న బియ్యాన్ని ఉచితంగా అందించనున్నారు. ప్రతి విద్యార్థికి 150 గ్రాముల చొప్పున నెలలో తరగతులు జరిగే రోజులతో లెక్కిస్తారు. లేదంటే నెలకు నాలుగు కిలోల బియ్యాన్ని పంపిణీచేసే అవకాశం ఉన్నది. పప్పు దినుసులు, నూనె, ఇతర సామగ్రి, కూరగాయల ఖర్చులను అందించాలని యో చిస్తున్నారు. 

ప్రతినెలా ఒక్కో విద్యార్థికి రూ.120 నుంచి రూ.130 వరకు వంట ఖర్చులను విద్యార్థులు లేదా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలకు జమచేసే ఉద్దేశంతో ఉన్నట్లు తెలిసింది. ఖర్చులో కేంద్రం వాటా 60 శాతం, రాష్ట్రం వాటా 40 శాతంగా ఉండనుంది. మరో రెండు, మూడు నెలల దాకా బడులు ప్రారంభించే అవకాశాలు లేవని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటికే బియ్యం పంపిణీ చేయడం మంచిదని చెప్పారు.


logo