సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 21, 2020 , 07:18:03

ఆన్‌లైన్‌లోనే.. గ్యాస్‌ బుకింగ్‌, నగదు చెల్లింపు

ఆన్‌లైన్‌లోనే.. గ్యాస్‌ బుకింగ్‌, నగదు చెల్లింపు

హైదరాబాద్‌:  కరోనా వైరస్‌ నేపథ్యంలో వంట గ్యాస్‌ పంపిణీదారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వం చేపడుతున్న జాగ్రత్త చర్యలకు తమవంతుగా వారు కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గ్యాస్‌ బుకింగ్‌తోపాటు నగదు చెల్లింపు, కొత్త సిలిండర్ల బుకింగ్‌ తదితర అన్ని సేవలు అన్‌లైన్‌ ద్వారానే నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

 గ్యాస్‌ బుకింగ్‌ చేసిన వెంటనే ఆన్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ డబ్బులు చెల్లించాలి (డిజిటల్‌ పేమెంట్స్‌). దీనివల్ల కరెన్సీ ద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టే వీలు కలుగుతుంది

 వినియోగదారులు ఆఫీసుకు రాకుండా ఉండేందుకు కొత్త కనెక్షన్‌, రెండో  సిలిండర్‌, చిరునామా మార్పు తదితర అన్ని సేవలు ఆన్‌లైన్‌ ద్వారా, ఫోన్‌ ద్వారానే పొందే వీలుకల్పిస్తున్నాం.

 గ్యాస్‌ పంపిణీ సందర్భంగా కరోనా వ్యాప్తి జరగకుండా జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పటికే సిబ్బందికి మాస్క్‌లు, గ్లౌజ్‌లు ఇవ్వడంతో పాటు జాగ్రత్త చర్యలపై వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించాం.

 జనతా కర్ఫ్యూ కారణంగా ఈనెల 22న అత్యవసర గ్యాస్‌ పంపిణీ మినహా మిగిలిన సేవలను నిలిపివేస్తున్నాం.

 ఆయిల్‌ కంపెనీలు (హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐఓసీఎల్‌) సిలిండర్లు డీలర్లకు సరఫరా చేసేముందే వాటిపై క్రిమిసంహారక మందులు పిచికారీచేసి పంపాలని కోరాం.

 రెండో  సిలిండర్‌ లేనివారు వెంటనే డీలర్‌ని సంప్రదించి పొందవచ్చు. దీపం లబ్ధి దారులకు కూడా ఇది వర్తిస్తుంది. రెండో సిలిండర్‌ ఖాళీగా ఉంటే వెంటనే నింపిచ్చుకోవాలి.

 సిలిండర్‌ పొందిన వెంటనే సరఫరా సిబ్బంది సమక్షంలోనే సీల్‌ తొలగించి లీకేజీ ఉన్నదేమో పరిశీలించుకోవాలి.

 సురక్షా పైపును మాత్రమే ఉపయోగించాలి. గ్యాస్‌ స్టవ్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి

 గ్యాస్‌ లీకేజి అయినట్లు  అనిపిస్తే కరెంటు స్విచ్‌లను తాకరాదు. తలుపులు, కిటికీలు తెరిచి రెగ్యులేటర్‌ నుంచి సిలిండర్‌ను వేరుచేసి,సిలిండర్‌కు తెల్లని రక్షణ మూతను బిగించి సిలిండర్‌ను ఆరుబయట ఉంచాలి. వెంటనే మీ   గ్యాస్‌ పంపిణీదారుకు కానీ,1906 నంబరుకు కానీ ఫోన్‌చేయాలి.


logo